తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ పర్యటన నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న (డిసెంబరు 22) గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్లు అందరితో భేటీ అయి ఆయన వేర్వేరుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 8 వరకూ ఆయన గాంధీ భవన్‌లోనే ఉన్నారు. పార్టీలో అందరితో మాట్లాడానని పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారని, అందరూ కలిసి పని చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. కలిసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థుల్ని ఓడించగలమని అన్నారు. పార్టీ నేతలందరికీ చేతుల జోడించి చెబుతున్నానని, సమస్యలేమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హితవు పలికారు. పార్టీలో విబేధాలపై నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దని నిర్దేశించారు. బీఆర్ఎస్‌పై పోరాటానికి కాంగ్రెస్ నేతలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ పనితీరు వల్లే పార్టీ ముందుకు వెళ్తుందని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన 34 ఏళ్లకు, తాను 38 ఏళ్లకు పీసీసీ చీఫ్‌లుగా పనిచేశామని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి సీఎంతో కలిసి పనిచేసి విజయం సాధించామని చెప్పారు. సీనియర్లు, జూనియర్లు అనే ప్రస్తావన వద్దని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని అన్నారు.
జోడో యాత్రను ఆపాలని కేంద్రం కుట్ర - దిగ్విజయ్
‘‘భారత్ జోడో యాత్రను సక్సెస్ చేసినందుకు టీ కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి యాత్రను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కరోనా సాకుతో యాత్రను అడ్డుకునే కుట్ర చేస్తుంది. బీజేపీ కార్యక్రమాలకు మాత్రం కరోనా అడ్డుకాదు. ఇదెక్కడి న్యాయం? కశ్మీర్ వరకు యాత్ర జరిగి తీరుతుంది. కేంద్రం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు.. కానీ జోడో యాత్రను మాత్రం ఆపమంటుంది. కరోనా ఎక్కువ ఉన్న దేశాల నుండి వస్తున్న విమానాలను ఎందుకు ఆపడం లేదు?
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, మరిచారు. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేస్తున్నారు. దేశంలో బీజేపీ కూడా ఇదే చేస్తుంది. పార్లమెంట్ లో బీఆర్ఎస్, బీజేపీని సమర్థిస్తుంది. బీఆర్ఎస్ - బీజేపీకి లోపాయికారి సంబంధం ఉంది. ఎంఐఎం బీజేపీని గెలిపించేందుకు పనిచేస్తుంది. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది కాంగ్రెస్. ఓవైసీ గుర్తించుకోవాలి. కేసీఆర్ కు ఎందుకు ఎంఐఎం మద్దతు ఇస్తుందో చెప్పాలి.
‘‘పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని నేతలకు చెబుతున్నా. అందరి అభిప్రాయాలు విన్నాను. బీజేపీ, బీఆర్ఎస్ లపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పార్టీలో అందరు ఐక్యంగా పనిచేయాలి. అప్పుడే గెలుస్తాం. పార్టీ నాయకులు మీడియా ముందు కాదు. ప్రజల పక్షాన రోడ్డెక్కి పోరాడండి. 99 శాతం హిందువులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించాం. దేశంలో ఎవరిది మునిగే పడవనో అర్థం చేసుకోవాలి. పార్టీలో సీనియర్ జూనియర్ అన్నది బేదం ఉండకూడదు’’ అని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు.