కైకాల సత్యనారాయణ... ఈ పేరు వెండితెరపైనే కాదు కాదు రాజకీయ వేదికపై కూడా హిట్‌ టాక్‌ అందుకున్న వ్యక్తి. పాలిటిక్స్‌లోనూ తన మార్క్ చూపించారు. ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు తోడుగా ఉన్నారు కైకాల. 


చంద్రబాబు ప్రోత్బలంతో...


1996లో కైకాల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిలో సత్యనారాయణ కూడా ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ చాలా కాలం వరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజకీయాల్లో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు బలవంతం చేయడంతో కాదనలేకపోయారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తరపున ఎంపీగా పోటీ చేశారు. 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.


ఏ పని చేసినా పట్టుదలతో దాన్ని పూర్తి చేసే కార్యదక్షత కైకాల సొంతం. అలానే రాజకీయాల్లో కూడా చేయాలని సంకల్పించారు. మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు అలానే పని చేశారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తర్వాత రాజకీయాల్లో తనలాంటి వాళ్లు సెట్ కాలేరని గ్రహించి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఒకసారి ఓటమిపాలైన తర్వాత మళ్లీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 


రాజకీయాల గురించి పూర్తిగా ఆలోచించడం మానేసి... సినిమాలపైనే తన మనసును లగ్నం చేశారు. ఆ రోజు నుంచి ఎప్పుడూ తన నోట రాజకీయం మాట వినిపించలేదు. అందుకే ఆయన అన్ని పార్టీల వాళ్లకు మిత్రుడిగా మెలిగారు. కైకాల మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


విలక్షణ నటుడు కైకాల - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు


విలక్షణ నటుడిగా, ఘటోత్కచుడుగా సినీ అభిమానులను మెప్పించి 777 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ మృతి చిత్ర సీమకు అభిమానులకు తీరని లోటు అని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.


తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు -గుత్తా సుఖేందర్ రెడ్డి


సినీ నటుడు, కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటునని ఆయన తెలిపారు. 777 సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటించిన కైకాల సత్యనారాయణ తెలుగుసినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచారని ఆయన చెప్పారు. కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.


కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 87ఏళ్ల వయసులో శుక్రవారం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 1935, జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు (మ) కౌతారంలో జన్మించారు. గుడివాడలో ప్రాథమిక విద్య, విజయవాడలో ప్రాథమికోన్నత విద్యను పూర్తి చేశారు. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 770కిపైగా సినిమాల్లో నటించారు. 


కైకాల మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది . ఇదే ఏడాది కృష్ణంరాజు, కృష్ణ వంటి వారిని కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో పెద్ద దిక్కును కోల్పోయింది. కైకాల మృతి పట్ల అభిమానులు, సీనీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.