Telangana Congress CLP Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో దీన్ని (CLP Meeting) నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ అంతకుముందు డీకే శివకుమార్ బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్‌లో సీనియర్ నేతలతో సమావేశం అవ్వడం వల్ల సీఎల్పీ మీటింగ్ 12 గంటలకు ప్రారంభించారు.


ఈ సీఎల్పీ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై నేతల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతను (CLP Leader) కూడా ఎన్నుకుంటారు. సీఎం ఎంపిక కోసం అందరూ ఏకవాక్య తీర్మానం చేస్తారని తెలుస్తోంది. అందరూ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా రేవంత్‌కి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తీర్మానం ఆధారంగా అధిష్ఠానం సీఎం పేరును ఖరారు చేయనుంది. అధిష్ఠానం ఏ పేరును ఖరారు చేసినప్పటికీ శిరసావహించాలని ఈ మీటింగ్‌లో తీర్మానం చేసుకోనున్నారు. సీఎల్పీ మీటింగ్‌కి ఏఐసీసీ ప్రతినిధులు కూడా హాజరు అయ్యారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఈ సీఎల్పీ మీటింగ్ తర్వాత వీలైతే నేడే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేర్లను ఖరారు చేసి వారితో నేడే ప్రమాణ స్వీకారం చేయించాలని భావిస్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు సప్తమి ఘడియలు ఉన్నందున శుభదినంగా భావించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నారు. లేదంటే ఈ నెల 6న ప్రమాణ స్వీకార కార్యం ఉండే అవకాశం ఉంది. అది కూడా కుదరకపోతే డిసెంబర్ 9న పెద్ద స్థాయిలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.


రేవంత్ రెడ్డికే ఎక్కువ ఛాన్స్ - వీహెచ్ (V. Hanmanth Rao)


‘‘సీఎల్పీ మీటింగ్‌లో ఏం చర్చిస్తారనేది చూడాలి. తెలంగాణ సీఎం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు రేవంత్ రెడ్డికే ఉన్నాయి’’ అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీ హనుమంతరావు మీడియాతో చెప్పారు.






బీఆర్ఎస్‌ని బొంద పెట్టారు - సీతక్క (Seethakka News)


గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు నిన్నటి నుంచే బస చేయగా, దూర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు నేడు ఉదయం హోటల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘‘ప్రజలు బీఆర్ఎస్ కు బొంద పెట్టారు. డబ్బులతో నన్ను ఓడించాలని చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేశారు. సీఎం ఎవరు అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది. సీఎల్పీ సమావేశంలో నా ఆభిప్రాయాన్ని వెల్లడిస్తా’’ అని సీతక్క అన్నారు.