గవర్నర్ తమిళిసైతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్ల జరిగిన నష్టం, రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఫిర్యాదు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, జీవో 111 రద్దు విషయాలపై గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్, బలరాం నాయక్, నాగం జనార్ధన్‌రెడ్డి, కొదందరెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాస్కి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, అంజన్ కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో వీరు సమావేశమై రాజ్ భవన్‌కు బయల్దేరారు. రాష్ట్రంలో నిరుద్యోగం, 111 జీవో, విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్ తదితరాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని, వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రైతుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదని అన్నారు. వర్షాల వల్లనే భూగర్భ నీటి వనరులు పెరిగాయని అన్నారు. తమ పోరాటం వల్లే కేసీఆర్ ధాన్యం కొంటున్నారని అన్నారు. వచ్చే నాలుగు రోజులు తనతో పాటు పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామని చెప్పారు. కొనే ఉద్దేశం ఉంటే ముందే కొనొచ్చు కదా అని.. ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ చేసేదంతా చూస్తుంటే బీజేపీ - టీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలాగా కనిపిస్తోందని అన్నారు. రేపో మాపో కేసీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.