Ponguleti Srinivas Reddy Review: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న భద్రాచలం రాములోరి సన్నిధిలో ఐదవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు.
బుధవారం (మార్చి 6) సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి విడతగా ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమని, ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కల... అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే అని అన్నారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని, కానీ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని, ప్రజల అవసరాలను ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని విమర్శించారు. కానీ మా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించడానికి అవసరమైన కార్యచరణను ప్రారంభించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమీషనర్లు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయలు మంజూరు చేయనున్నామని, 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్లను నిర్మించాలని, హాలు, బెడ్ రూమ్ తో పాటు వంటగది, బాత్ రూమ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల పేరుపైన ఇండ్లను మంజూరు చేస్తామని, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంభందించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు.
పేదవారి సొంతింటి కల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు సాకారం కాబోతున్నదని మంత్రిగారు సంతోషం వ్యక్తం చేశారు.