Telangana CM Revanth Reddy: తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన పత్రికలు, మీడియా సంస్థలు, అక్కడ పని చేసే ప్రతినిధులు జర్నలిస్టులా లేకా కుటుంబాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా అని ప్రశ్నించారు. వాళ్ల కామెంట్స్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఊరుకొని ఉంటున్నామని అన్నారు. లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
గతంలో ఛానల్స్ ఏదో సెటైరిక్ స్టోరీలు వేస్తే వాటిని ఆ ఛానల్స్‌ను కేసీఆర్ ఏడాది పాటు బ్యాన్ చేశారని గుర్తు చేశారు. అలాంటిది తాము ఎవర్నీ ఏమి అనడం లేదని తెలిపారు. కానీ జర్నిలిజం ముసుగులో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వాటిని చూస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు. అసలు జర్నిలిస్టులు అంటే ఎవరని... వారిని అలా గుర్తింపు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. జర్నలిస్టు ముసుగులో చేసే కామెంట్స్‌పై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కొన్ని రెగ్యులరేషన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదో విష సంస్కృతిలా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే చాలా బాధ కలుగుతుందన్నారు రేవంత్. అందుకే దీనిపై అందరూ బాధ్యతగా స్పందించాలని సూచించారు. అవసరమైతే చట్టం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. జర్నలిస్టు సంఘాలతో మాట్లాడాలని సూచించారు. జర్నలిజం ముసుగులో కొందరు చేసే వ్యక్తిగత కామెంట్స్‌ను చూస్తుంటే తనతోపాటు చాలా మంది బాధపడుతున్నారని అన్నారు రేవంత్. ఇదే విషయం ప్రజలకు పార్టీ కార్యర్తలకు తెలిస్తే బట్టలూడది రోడ్డుపైకి తీసుకొచ్చి కొడతారని హెచ్చరించారు. నీచమైన భాషతో వాళ్లు చేసే కామెంట్స్‌లో తన పేరు తీసేసి వాళ్లను ప్రోత్సహించే వాళ్ల పేర్లు పెట్టుకొని చూడలని సూచించారు. ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తుందన్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి చూసీచూడనట్టు వెళ్లిపోతున్నామని ఇకపై ఉపేక్షిస్తే ఇది మరింత పెచ్చురిల్లితుందని ఆందోళన వ్యక్తం చేశారు
జర్నలిస్టులపై అసెంబ్లీలో రేవంత్ చేసిన కామెంట్స్ ఆయన మాటల్లోనే...... "పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి వాటిని రికార్డు చేసి సోషల్ మీడియా పెడితే వాళ్లపై పోలీసులు కేసులు పెడితే మీకు దుఃఖం వస్తుంది. సోషల్ మీడియాలో పెట్టిన ఆ భాషను ఒక్కసారి చూడండి అధ్యక్ష. 2014లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఛానల్స్‌లో ఏదో వెటకారంతో ఏదో వేస్తే ఏడాది బ్యాన్ చేశారు. చాలా మందిని జైల్లో పెట్టారు. ఇవాళ జైలుకు వెళ్లిన అమ్మాయి కూడా అప్పట్లో జైలుకు పోయి వచ్చారు. ఎవరు జర్నలిస్టులు అని నేను ఈ వేదికపై నుంచి అడగదలచుకున్నాను. ఐఅండ్‌పీఆర్ లేదా డీఐబీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు, వాళ్లు ఇచ్చే ఐడీ కార్డులు ఉన్న వాళ్లు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ట్యూబ్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా అధ్యక్షా... ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడతున్నాం అధ్యక్షా... రక్తం మరుగుతుంది. ఏందా భాష అధ్యక్షా? నిజంగా మీరు మనుషులా అని అడగదలుచుకున్నాం. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా, మీ అమ్మనో చెల్లినో ఇలా అంటే వింటారా అని నేను అడుగుతున్నాను ఈ అరెస్టును ఖండించినవాడిని. నా భార్యను బిడ్డను తిడుతుంటే నాకు నొప్పి అవుతుంది కానీ ఓ ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పిలేదా? మీరు
ఏ సంస్కృతిలో ఉన్నారని అడుగుతున్నాను. తోలు తీస్తాను ఒక్కొక్కడ్ని ముఖ్యమంత్రిగా చెబుతున్నాను. బట్టలు విప్పి రోడ్డు మీద తిప్పిస్తా. ప్రజాజీవితంలో ఉన్న మమ్మల్ని విమర్శించండి. విశ్లేషించండి. మా గురించి మాట్లాడండి. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది. తెలంగాణ సమాజం ఇదేనా. ఈ చైతన్య ప్రాంతంలో ఎదురించి నిలబడిన వాడే మొనగాడు. ఆధిపత్యంపై కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని సర్వనాశనం చేసి విష సంస్కృతిని నోటికి వచ్చిన మాట్లాడించి వాటిని పోస్టు చేయించి ఇదేం పైశాచిక ఆనందం. వాళ్లు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీరు పెట్టండి. మీకు అన్నం తినబుద్ది అవుతుందేమో చూస్తాను.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనమైపోయినట్టా అధ్యక్ష. అట్లా అనుకుంటున్నారా. ఓపిక పట్టిన. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెల్వదు. లక్షల మంది రోడ్లపైకి వచ్చి బట్టలిప్పదీసి కొడతారు. నేను వద్దంటున్నా కాబట్టి చట్టంపై గౌరవం ఉంది కాబట్టి ఏమనకుండా ఊరుకుంటున్నాం. చంద్రశేఖర్‌రావు మీ పిల్లలకు చెప్పుఇది మంచిది కాదు. మానసికంగా కుంగదీసి దెబ్బ తీయొచ్చని అనుకుంటున్నారేమో. అలా కుదరుదు. హద్దుదాటితే, మాట జారితే ఫలితం ఎలా ఉంటుందో మీరు అనుభవిస్తారు.
పదవి ఎంతకాలం ఉందనేది కాదు. ఎట్ల ఉన్నామో అన్నదే నేను లెక్కగడతా. ఆత్మగౌరవం చంపుకొని లాలూచి పడి రాజకీయం నేను చేయను అధ్యక్ష. ఉన్నతం కాలం నిటారుగా ఉంటా, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. అవసరం అయితే చట్టాన్ని సవరించే పని చేస్తాం. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇది మంచిదా అధ్యక్ష. తెలంగాణ ఇలాంటి సంప్రదాయం ఉందా అధ్యక్ష. తెలంగాణ ఉద్యం పీక్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు.
వీటిని క్షమించే సమస్య లేదు. చంద్రశేఖర్ రావు వినండి మీ పిల్లలకు చెప్పండి. ఇలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడనే ఉప్పుపాతరేయదలుచుకున్నాను. ఎవర్నీ వదలను. ప్రజాస్వామ్యయుతంగా విమర్శించండి. సరిద్దికోవడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవిస్తాం. దీనిపై చర్చ జరగాలి. జర్నిలిస్టు సంఘాలు కూడా ముందుకు రావాలి. జర్నలిస్టు అనే పదానికి అర్థమేంటో ఇవ్వండి.... ఆలిస్టు కూడా ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న వాళ్లు ఇలాంటి తప్పులు చేస్తే ఏం శిక్ష వేస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోళ్లు జర్నలిస్టు కాడు. వాళ్లను క్రమినల్‌గానే చూస్తాం. ఆ క్రిమినల్స్‌ను ఎట్లా జవాలు చెప్పాలో అట్లానే చెబుతాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడబీకి బట్టలూడదీసి కొడతాం. తమాషా చేయొద్దు. అన్నిచట్టపరిధిలోనే చేస్తాం. చట్టాని ఎక్కడా దాటబోం. ప్రతి దానికి ఒక శిక్ష, విధానం ఉంది.విశృంఖలత్వాన్ని ఆపాలి. తెలంగాణ సమాజానికి చీడపురుగులా మారుతుంది. దాని నియంత్రణకు చట్టం చేద్దాం."