Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి. మొదటి రోజు జగదీష్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన సభ ఆయన్ని సస్పెండ్‌ చేశారు. అదే ఎఫెక్ట్‌ శనివారం సమావేశాలపై కూడా పడింది. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య వాడివేడీ చర్చ జరిగింది. చివరకు సీఎం ప్రసంగాన్ని బీఆర్‌ఎస్ బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 


కేసీఆర్‌పై ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేచర్‌ అనే విషయంలో సీఎం చేసిన కామెంట్స్‌ వైరల్ అయ్యాయి. దీనిపై అప్పుడే బీఆర్‌ఎస్‌ మండిపడింది. ప్రతిపక్ష నేత చావు కోరడం ఏంటని ప్రశ్నించారు. అప్పుడు రేవంత్ చేసిన కామెంట్స్ పై నిరసనగా ఇవాళ్టి సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశారు. 


వాకౌట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. "పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరించాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారు. 299 టిఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి..299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్ దే. ఢిల్లీలో రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారు. పొత రెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నావు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదు.. 40 రోజులు అసెంబ్లీని స్థంభింపచేశాం. తెలంగాణ కోసం మేము ఆ రోజు 6 మంత్రి పదవులు వదులుకున్నాం. అని గుర్తు చేశారు. 


"చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఉత్తమ్ భోజనం చేసి వచ్చారు. కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసేలా ద్రోహం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. 573 టిఎంసీల నీళ్లు సెక్షన్ 3 ద్వారా తెచ్చింది మేము. ద్రోహ చరిత్ర ఉత్తమ్‌ది. త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎస్. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణం.. కృష్ణ నీళ్లను సముద్రంలో కలిపారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు ఇవ్వగలిగాం. హుజూర్ నగర్ ని ముంపుకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారు. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నాం. అని మండిపడ్డారు. 


అంతకు ముందు రైతు రుణమాఫీ, గృహ జ్యోతి పథకాలపై జరిగిన డిబేట్ సభలో వేడిపుట్టించింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నర్‌ ప్రసంగంలో ఎలాంటి దిశానిర్దేశం లేకుండా తప్పుడు ప్రకటన చేయించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుచేయలేదని ఆరోపించారు. రుణమాఫీ అని ప్రచారం చేశారని అది కూడా చేయలేదని అన్నారు. వీటిని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 


బీఆర్‌ఎస్‌ నేతల కామెంట్స్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పవర్‌ఫుల్‌ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎంతెంత రుణమాఫీ జరిగిందో వివరించారు. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో తెలిపారు. గృహజ్యోతి. ఇతర పథకాల కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిపారు. ఇన్ని జరిగినప్పటికీ ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.