Revanth Reddy Latest News: వరంగల్‌లో ఈ మధ్య కాలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభలో తన పేరు చెప్పే ధైర్యం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేకపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నిత్యం ఫామ్‌హౌస్‌లో ఉంటూ అసలు విషయాలు తెలుసుకోకుండా కడుపు నిండా విషం నింపుకొని మాట్లాడారని విమర్శించారు.  ప్రజల్లో ఉంటే వారికి అందుకున్న సంక్షేమ ఫలాలు గురించి తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. 

బసవేశ్వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు అని అభివర్ణించారు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు రేవంత్. బసవన్న స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థ తెచ్చుకున్నట్టు వెల్లడించారు.  

ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు రేవంత్. అలాంటి ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలు ఉండాలన్నారు. కానీ ఇక్కడ మొన్న ఒకాయన వరంగల్‌లో సభ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శించారన్నారు. "వాళ్లు రజతోత్సవాలు, విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు అభినందించే వాళ్లు. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు. ఇది ఏ చట్టంలో ఉంది?. ప్రతిపక్ష నాయకుడిగా రూ.65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు." అని రేవంత్ విమర్శఇంచారు. 

ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్‌లో ఎందుకు పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీఆర్ఎస్‌ను నిలదీశారు రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్‌లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు. ఇంకా ఏమన్నారంటే..." సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి." అని ధ్వజమెత్తారు. 

కావాలని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. "కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేషపూరిత ప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?. ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం…" అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

కేసీఆర్ మాటల్లో, కళ్ళల్లో విషం కనిపిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అని ప్రశ్నించారు. పదేళ్లు దోచుకున్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదని అన్నారు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబమేనన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కెసిఆర్ వరంగల్ వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారని కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారన్నారు. వరంగల్ సభలో పేరు కూడా పలకలేకపోయారని ఫైర్ అయ్యారు.  

బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. పేదలకు పంచాలి అనే విధానంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రజలకు మేలు చేయడమే తమ పని అని ప్రచారం చేయాల్సింది ప్రజలే అని చెప్పుకొచ్చారు. ప్రజలే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అని అభివర్ణించారు.