Telangana Will become Business Hub says CM Revanth Reddy | హైదరాబాద్: త్వరలో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం తెలంగాణలో పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తేవాలన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో విద్యుత్ శాఖపై రేవంత్ రెడ్డి బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు.


మిగులు విద్యుత్ పై రైతులకు ఆదాయం రావాలి


సమీక్షలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. పలు శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు తీసుకోవాలి. అన్నదాతలకు పంటల కోసం సోలార్ పంప్ సెట్ లను ఉచితంగా అందించాలి. తద్వారా వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలి. కొండారెడ్డి పల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి. సోలాట్ పంప్ సెట్ ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయండి. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించడంపై అధికారులు ఫోకస్ చేయాలి. మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి, వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు మనం ప్రోత్సహించాలి.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ 


ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరా ఆగొద్దు


అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధికారులు ఏర్పాట్లు చేయాలి. ప్రతీ ఏడాదికి 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలి. ఓ ప్లాన్ ప్రకారం నడుచుకుని విద్యుత్ పై దుబారాను తగ్గించాలి. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆలోచించాలి. ఒక్క నిమిషం కూడా తెలంగాణలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు. వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలి. వినియోగదారులకు మాత్రం విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని’ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Also Read: జైనూర్‌లో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు! 144 సెక్షన్ కూడా - జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!