Home Guard sells FASTag stickers for police vehicles : పోలీసులకు క్రిమినల్ మైండ్ ఉండాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే క్రిమినల్స్, దొంగలు ఎలా ఆలోచిస్తే.. అంతే ఆలోచించి వాళ్ల ప్రయత్నాలు భగ్నం చేయడం లేదా.. అప్పటికే దొంగతనం చేసిన వారిని అరెస్టు చేయడం వంటివి చేయడానికి ఆ మైండ్ సెట్ పనికి వస్తుందని అనుకుంటారు. కానీ హైదరాబాద్ లోని ఓ హోంగార్డు తనకు ఉన్న ఈ క్రిమినల్ మైండ్ సెట్ ను దొంగల్ని పట్టుకోవడానికి కాకుండా.. దొంగతనం చేయడానికి ఉపయోగించారు. అక్కడే సీన్ అడ్డం తిరిగింది. ఎంతగా అంటే వచ్చిన పర్మినెంట్ పోలీసు ఉద్యోగం కూడా రిస్క్ లో పడిపోయేంతగా.
హోంగార్డు డ్రైవర్‌గా పని చేస్తూ ఫాస్టాగ్ స్టిక్కర్లు అమ్ముకున్న మహమ్మద్
హైదరాబాద్ పోలీస్ ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న నిస్సార్ మహమ్మద్ అనే వ్యక్తి ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సంతోషంగా ఉన్నాడు.కానీ హఠాత్తుగా పోలీసులు అరెస్టు చేశాడు. ఎందుకంటే.. పోలీసువాహనా ఫాస్టాగ్ స్టిక్కర్లను దొంగతనం చేసి..ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చాడు. ఒక్కో స్టిక్కర్ కు ఎనిమిది వేల రూపాయలు నెలకు వసూలు చేసేవాడు. ఆ వాహనాలు ఎక్కడ తిరిగిన ఆ ఫాస్టాగ్ బిల్లు పోలీసుల ఖాతాకు జమ అయ్యేది.
గుర్తించి అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు
అయితే వేరే వాహవాలకు పోలీసు ఫాస్టాగులు ఉన్నాయని..డబ్బులు కట్ అవుతున్న వైనం గుర్తించిన వారు పోలీసు శాఖను అలర్ట్ చేశారు. దీంతో తీగ లాగారు. ముందుగా పోలీసుల ఫాస్టాగ్ స్టిక్కర్లను వాడుకున్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు క్యాబ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఫాస్టాగ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆ కార్ ఓనర్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమకు ఈ స్టిక్కర్లను నిస్సార్ మహమ్మద్ ఇచ్చాడని చెప్పారు. ఈ మూడు క్యాబుల్ని సీజ్ చేసిన పోలీసులు .. కానిస్టేబుల్ నిస్సార్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు.
కక్కుర్తితో వచ్చిన పోలీస్ ఉద్యోగం పోగొట్టుకున్న నిస్సార్
దాదాపు ఏడాది కాలంగా సాగుతున్న ఈ ఫాస్టాగ్ స్టిక్కర్ ల దందా జరుగుతున్న శంషాబాద్ ఆర్జిఐఏ పోలీసులు గుర్తించారు. నిందితుడికి ఇటీవలే కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. హోంగార్డు నుంచి కానిస్టేబుల్ గా పర్మినెంట్ గా విధుల్లో చేరాల్సి ఉంది. ఈ లోపు దొంగతనం బయటపడటంతో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు ఆ ఉద్యోగం రిస్క్ లో పడిపోయింది. అందుకే కక్కుర్తి పడితే.. చిల్లర మిగులుతుంది కానీ.. జరిగే నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఈ నిస్సార్ మహమ్మదే సాక్ష్యం.