కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ మృతి విషయాన్ని కుమారుడు, ఎంపీ అరవింద్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ టైంలో ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. "అన్నా అంటే చాలు నేనున్నానంటూ ముందు ఉండి ఆపదలో ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్‌ మిస్‌ యూ డాడీ... నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించని చెప్పింది నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నాలోనే ఉంటావు" అని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చారు. 


ధర్మపురి శ్రీనివాస్ ఎందరో నేతలకు ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి... ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. "ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీకి డీఎస్‌ విశిష్ట సేవలు అందించారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శం. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు." డీ శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు రేవంత్‌. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు


ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. "సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. బీజేపీ ఎంపీ అరవింద్‌కి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.