KCR Review Meeting at Pragathi Bhavan: ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సీఎం తెలిపారు. స్వరాష్ట్రంలో వొక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఉందన్నారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని ప్రభుత్వాధికారులకు సీఎం పునరుద్ఘాటించారు.
వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించండి
‘‘ రోటీన్ గా అందరూ పనిచేస్తరు కానీ మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం. నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజు ఆలోచించాలె. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా జీవించి, రసించి, ఆలోచించి చేస్తున్నం అనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదుగగలం. మూస ధోరణులను సాంప్రదాయ పద్దతులలో కాకుండా వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.’’ అని సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్ష, దానితో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధి
ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ... ‘‘ నేడు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరమున్నది. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అందరం కలిసి పని చేయాలి. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని సందర్భాల్లోంచి నేడు అన్ని రంగాల్లో గుణాత్మకాభివృద్ధిని తెలంగాణ సాధించింది. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చినయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా ప్రగతిని సాధించింది. తదనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు నేడు ఆర్థికంగా బలపడుతున్నాయి. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి ద్వారానే..ఇవన్నీ సాధ్యమైతున్నయి. తద్వారా ప్రభుత్వాలనుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. వారికి మరింత నాణ్యమైన ఉత్తమమైన సేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారుల మీదనే ఉన్నది.’’ అని కెసిఆర్ అన్నారు.
పౌర సౌకర్యాల పెంపుకోసం రోజు రోజుకూ డిమాండు పెరుగుతుందంటే, మన ప్రభుత్వం మీద ప్రజలకు పెరిగిన విశ్వాసమే అందుకు కారణమని సీఎం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలిన అవసరమున్నదని ఉద్యోగులతో సీఎం అన్నారు.
పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసలు
‘‘ఒకనాడు ప్రజాదరణకు నోచుకోని ప్రభుత్వ దవాఖానలు తదితర ప్రభుత్వ వ్యవస్థలు నేడు అత్యంత ప్రజాదరణతో రద్దీగా వుంటున్నాయి. ఒకనాడు తెలంగాణ నుంచి బయటకు పోయిన వలసలు నేడు రివర్సయినయి. దాదాపు 30 లక్షల మంది పక్క రాష్ట్రాలనుంచి తెలంగాణకు వలసవచ్చి బతుకుతున్న పరిస్థితి ఉన్నది. స్వరాష్ట్రంలో రాబడులు పెరిగి ఆర్థిక వనరులు పెరిగినాయి. పరిపాలనా సంస్కరణలతో గడప గడపకూ పాలనను తీసుకపోతున్నం. ప్రభుత్వం కృషితో అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణలో అన్ని శాఖలల్లో పని పరిమాణం పెరిగింది. పెరిగిన అభివృద్ధిని ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం తమ కర్తవ్య నిర్వహణను తీర్చిదిద్దుకోవాలి. పెరిగిన అభివృద్ధికి సమాన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటది. ’’ అని సీఎం స్పష్టం చేశారు.
ప్రజల ప్రాథమిక అవసరాలను నిత్యావసరాలను ఎంత గొప్పగా తీర్చగలమనేదే ప్రభుత్వోద్యోగికి ప్రధాన కర్తవ్యం కావాలని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నాటికి ఉమ్మడి పాలనలో శిధిలమై వున్న అన్ని రంగాలను తీర్చిదిద్ది నేడు వాటిని వొక ట్రాక్ మీదకు తీసుకురాగలిగామన్న సీఎం,. ప్రారంభ దశలో వున్న ఆందోళన ఇప్పడు అక్కరలేదన్నారు. అన్ని రంగాలు వాటంతంట అవి పనిచేసుకుంటూ పోయే స్థితికి తెచ్చుకున్నామన్నారు.
‘‘ గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే వుంటుండే. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. నిత్యం వానలతో నిర్మాణాత్మక పనుల నిడివి కూడా తగ్గింది. వర్షాలు లేని ఆరేడు నెల్ల కాలంలోనే మనం అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాల్సి ఉన్నది.’’ అని తెలిపారు.