KCR congratulates Allu Arjun for National Award : 


ప్రతీయేటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు పలు అవార్డులు సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకోవడంపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి సత్తా చాటి అవార్డులు కైవసం చేసుకున్న అందరినీ అభినందించారు. ఈసారి ఉత్తరాదితో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమకే అత్యధిక అవార్డులు వచ్చాయి.


69 ఏండ్లలో తెలుగు హీరోకి తొలి అవార్డు - గొప్ప విషయమన్న కేసీఆర్
తమ అత్యుత్తమ నటనతో ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు కేసీఆర్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లు అర్జున్ అన్నారు. తన ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణం అన్నారు. దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి లాంటి వారి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన వ్యక్తి అల్లు అర్జున్ అని, ఇందుకు ఆయన చాలా కృషి చేశాడన్నారు. 


తన సృజనాత్మక రచనతో సినిమా పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు, బెస్ట్ లిరిక్ రైటర్ గా జాతీయ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.  వీరితో పాటు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు సాధించిన దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన సినిమాల నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇతర భారతీయ సినిమా రంగాలతో పోటీపడుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నేడు హైద్రాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా రంగం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయం అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్ లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణమని కొనియాడారు. తెలుగు సినిమా రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.