Mallikarjun Kharge At Chevella Meeting: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. బీజేపీతో పాటు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ ను గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించిన బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్మేస్తోందని మండిపడ్డారు. మతతత్వ బీజేపీని గద్దె దించడానికి రాజకీయ శక్తులన్ని ఏకమయ్యాయని అన్నారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి... నెరవేరుస్తున్నామని ప్రకటించారు. 


రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని అన్నారు. రెండో విడత పాదయాత్రకు సిద్ధమయ్యారని వెల్లడించారు. లద్దాఖ్ లో రాహుల్ గాంధీ బైక్ రైడింగ్ చేశారన్న అన్న ఆయన...చైనా ఎంత భూభాగం ఆక్రమించిందో పరిశీలించారని తెలిపారు. నాగార్జున సాగర్, భాక్రానంగల్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు. భూసంస్కరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న ఖర్గే..., జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత, మధ్యాహ్నం భోజనం పథకాలను తామే తీసుకొచ్చామన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఇస్రోను కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ... పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిందన్న ఆయన...బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిందన్నారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు కూడా రాజీవ్ గాంధీ హయాంలోనే వచ్చాయన్నారు. గుజరాత్ లోనే అత్యధికంగా చిన్నారుల మరణాలు...నమోదవుతున్నాయని గుర్తు చేశారు. ప్రజల తరపున రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే...బీజేపీ సర్కార్ సస్పెండ్ చేసిందన్నారు. 


12 ఎన్నికల్లో పోటీ చేస్తే.... 11 సార్లు విజయం సాధించానన్నారు మల్లికార్జున ఖర్గే. మోడీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ సర్కార్ ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏఐసీసీలో తెలంగాణకు ప్రాధాన్యత కల్పించామన్నారు. 66 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు  చెందిన నేతలను కమిటీలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రజల అభిష్టం మేరకే తెలంగాణ ఏర్పడిందన్న ఖర్గే... సభకు వచ్చిన వారంతా తెలంగాణ కోసం పోరాటం చేసిన వారేనన్నారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు.