ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అరెస్టుకు గల కారణం ఇదేనంటూ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నడుమనున్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదని సిసోడియా అరెస్టుపై కేసీఆర్ మండిపడ్డారు.


మార్చి 4వ తేదీ వరకూ కస్టడీలోనే సిసోడియా
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది సీబీఐ. సిసోడియాకు 5 రోజుల రిమాండ్‌ ఇవ్వాలని కోర్టుని కోరింది. లిక్కర్‌ పాలసీలో కచ్చితంగా స్కామ్ జరిగిందని, అది కూడా చాలా సైలెంట్‌గా, ప్లాన్డ్‌గా చేశారని తేల్చి చెప్పింది. అంతే కాదు. సిసోడియాను A-1గా వెల్లడించింది. 5 రోజుల పాటు ఆయన CBI కస్టడీలోనే ఉండనున్నారు. మార్చి 4వ తేదీ వరకూ కస్టడీలోనే ఉంటారని స్పష్టం చేశారు అధికారులు.






"సిసోడియా కంప్యూటర్‌లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. కొందరి మంత్రుల నుంచి సిసోడియాకు నోట్‌లు వచ్చాయి. కమీషన్‌ ఉన్నట్టుండి 5 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచేశారు. ఒకవేళ ఈ పాలసీ నిజంగానే పారదర్శకంగా ఉండి ఉంటే కచ్చితంగా అమలు చేసే వాళ్లు. Indo Spirit అనే కంపెనీ సిసోడియా వల్ల లబ్ధి పొందింది. ఈ కేసులో తప్పకుండా ఫేస్ టు ఫేస్ ఇంటరాగేషన్ జరిపి తీరాలి. ఆయన ఫోన్‌లు కూడా పదేపదే మార్చారు. ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించారు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకూ సిసోడియా వాడిన ఫోన్‌లను మేం పరిశీలించాలి." - సీబీఐ 


Delhi Deputy CM Manish Sisodia Arrested: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయనను ఆదివారం (ఫిబ్రవరి 26న) ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు విచారించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.


మద్యం పాలసీపై పలు కోణాల్లో సీబీఐ అధికారులు సిసోడియాను ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదైన దినేష్ అరోరాతో పాటు ఇతర నిందితులతో సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. అయితే డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పిన సమాధానాలపై సీబీఐ అధికారులు సంతృప్తి చెందలేదు. సిసోడియా విచారణకు సరిగా సహకరించడం లేదని, విషయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీపై ఫోకస్ చేసి ఆప్ నేతల్ని వేధిస్తుందని ఢిల్లీ మంత్రులు ఆరోపించారు.