Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గం నేడు (ఏప్రిల్ 12) అత్యవసరంగా సమావేశం అవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్ స‌మావేశానికి మంత్రులు అంద‌రూ హాజ‌రు కానున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే పంటను కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. పంట కొనుగోలుపై కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్‌ లైన్‌ పెట్టారు. కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రేపటి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్‌ విధించాం. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తాం రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం. ఎవరితోనైనా గొడవ పచొచ్చు కానీ.. రైతులతో పడవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. రైతులను కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఊరికేపోదు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. కేంద్రాన్ని గద్దెదించే సత్తా రైతులకు ఉంది. తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా? రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం’’ అని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.


ఈ దీక్షకు రైతు జాతీయ నేత రాకేష్ టికాయత్ కూడా హాజరై మద్దతు తెలిపారు. ఆయన కేసీఆర్‌కు నాగలి బహుకరించారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో పోరాటం చేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి రాకేష్ టికాయత్ మద్దతు తెలిపారు. రైతులను వరి వేయవద్దని, పంట మార్పిడి చేయాలని తమ ప్రభుత్వం సూచించగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలు అన్నదాతలను తప్పుదోవ పట్టించి అన్యాయం చేయారని ఆరోపించారు.


రైతులు ఏం పాపం చేశారు..
2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులు, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు రావాల్సి వచ్చిందో దేశం మొత్తానికి తెలియాలి. మా రైతులు ఏం పాపం చేశారు. ప్రధాని మోదీకి నేను ఒక్కటే చెబుతున్నా.. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, కానీ రైతులతో మాత్రం కాదన్నారు. తెలంగాణ ప్రజలు, రైతులను నూకలు తినమని చెప్పడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇలాంటి వాఖ్యలు చేయడం కేంద్రం అహంకారాన్ని తెలియజేస్తుందంటూ కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం తీరు వల్లే ఈరోజు ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఎంపీ కేశవరావు పార్లమెంట్‌లో కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పారు. కానీ మేం గోల్ మాల్ చేశామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్న ఆయన పీయూష్ గోయల్ కాదని, పీయూష్ గోల్ మాల్ అని ఎద్దేవా చేశారు. 


తెలంగాణకు ఓ వ్యక్తిత్వం, అస్తిత్వం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాకోసం ప్రవేశపెట్టిన పథకాలు పెండింగ్‌లో పెట్టారు. తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగింది. అందుకోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. మా దగ్గర 3 లక్షల బోర్లు వేశారని రాకేష్ టికాయత్ కు తెలిపారు. మేం మా సొంత ఖర్చులతో రైతులకు మోటార్లు బిగించి ఇచ్చాం, దీని కోసం ఎన్నో కోట్లు ఖర్చుచేశామన్నారు. కాకతీయ రాజులు పాటించిన నీటి విధానాన్ని ఉమ్మడి ఏపీ పాలకులు నిర్లక్ష్యం చేశారు.


కొత్త ఉద్యమం ప్రారంభం కావాలి: రాకేశ్ టికాయత్
దేశంలో రైతుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభం కావాలని రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తెలంగాణ ప్రజలంతా మీ వెంట ఉంటారని కేసీఆర్ చెప్పారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. 13 నెలల పాటు రైతులు పోరాటం చేస్తే ప్రధాని మోదీ క్షమాపణ కోరారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. దేశ రైతులు బిక్షం అడగటం లేదని, తమ హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.