Praveen Kumar Met With KCR: హైదరాబాద్: బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నానని అందుకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. అక్కడ బీఆర్‌ఎస్ పోటీ చేయకుండా నేరుగా తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ప్రవీణ్ కుమార్, మరికొద్దిమంది ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధ లేదని, మర్యాదపూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంజాయిషీ ఇచ్చుకున్నారు. 


మంగళవారం నాడు ఉదయం "నా రాజకీయ ప్రస్థానం పై వస్తున్న వదంతులను నమ్మవద్దు. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే నా ప్రయాణం" అంటూ కేసీఆర్‌తో తన భేటీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఒంటరి అయిపోయిన బీఆర్ఎస్‌తో ఆర్ఎస్పీ భేటీ కావడం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది. మర్యాదపూర్వక భేటీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా... వదంతుల్ని నమ్మవద్దు అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పీ క్లారిటీ ఇచ్చినా లాభం లేకపోయింది. ఈ భేటీపైన రాజకీయ చర్చ జరిగిందనే ప్రచారం మాత్రం కొనసాగుతోంది.