తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. రెండోరోజు తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంగారెడ్డిలో పర్యటించి పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డి లోని పటాన్ చెరు చేరుకున్నారు. అక్కడ వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
మోదీ ప్రారంభించబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఇవే.
సంగారెడ్డిలో రూ. 9000 కోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 1298 కోట్లతో సంగారెడ్డి చౌరాస్తా నుంచి మదీనా గూడ వరకు ఏర్పాటు చేసిన ఆరు వరుసుల జాతీయ రహదారి ప్రారంభించారు. 399 కోట్లతో మెదక్- ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవేను జాతికి అంకితం చేశారు. 3338 కోట్లతో నిర్మించిన పారాదీప్- హైదరాబాద్ గ్యాస్‌పైప్‌లైన్ ప్రారంభించారు. తర్వాత నాలుగు వందల కోట్లతో చేపట్టే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. 1409 కోట్లతో నిర్మించిన కంది రామసామి పల్లె సెక్షన్4లో నాలుగు వరుసల నేషనల్ హైవే ప్రారంభించారు. 323 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన మిర్యాలగూడకోదాడ హైవే విస్తరణ రోడ్డును కూడా జాతికి అంకితం చేశారు. రూ. 1165 కోట్లతో హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించారు. ఘట్‌కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైలు ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులతో తెలంగాణకు ఎన్నడూ లేని లబ్ధి
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... రెండు రోజులు తెలంగాణ ప్రజల మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. సంగారెడ్డి వేదికగా రూ. 7వేల కోట్లు అభివృద్ధి పనులు ప్రారంభించామని ప్రజలకు వివరించారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో ఎన్నడూ లేనంతగా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పదేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్యను రెట్టింపు చేశామని వికసిత్ భారత్ దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. ఇందులో భాగంగా దేశంలోనే తొలి ఏవియేషన్ సెంటర్‌ను బేగంపేటలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.