తెలంగాణలో వినాయక నిమజ్జన వివాదం మరింత ముదురుతోంది. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించినా బీజేపీ శాంతించడం లేదు. తూతూమంత్రంగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోందని ఆరోపింస్తోంది ప్రభుత్వం. 



వినాయక విగ్రహాలన్నీ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేయిస్తామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్. దీని కోసం హిందువులంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్‌పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే దారుస్సలాంలో సంబురాలు చేసుకుంటున్నారని విమర్శలు చేశారాయన. దారుస్సలాంను సంతృప్తిపర్చడానికి హిందువులను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. 






తెలంగాణ రాష్ట్రసమితి, కేసీఆర్‌, మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్. నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు కావాల్సింది హిందువులు ఇబ్బంది పడటమేనా అని ప్రశ్నించారు. ముందు నుంచి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం వద్దని చెప్పిన ప్రభుత్వం తర్వాత దిగొచ్చిందన్నారు. భాగ్యనగర ఉత్సవ సమితి పోరాటంలో వెనక్కి తగ్గిందన్నారు. ఇప్పుడు ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. 
 
నిమజ్జనం కోసం తూతూ మంత్రంగానే ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. మంత్రుల అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాస్తికుడని తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా హిందువులంతా కదలి రావాలని... ట్యాంక్‌బండ్‌పై కూర్చొని విగ్రహాలను నిమజ్జనం చేయిద్దామన్నారు. నిఖార్సైన హిందుత్వవాదినని చెప్పుకుంటున్న కేసీఆర్ అసలు బండారాన్ని ప్రపంచానికి చాటి చెబుదామని పిలుపునిచ్చారు. 


బీజేపీ చేస్తున్న విమర్శలను తీవ్రంగా  తప్పుపట్టారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వినాయక నిమజ్జనం కోసం జరుగుతున్న పనులను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ మెయర్‌తో కలిసి ట్యాంక్‌బండ్‌ను సందర్శించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు, దుస్సంఘటనలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను బీజేపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్