Bandi Sanjay About Dharani: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ధరణిని కొనసాగిస్తామని, తొలగించే ఉద్దేశం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయితే ధరణి వెబ్ సైట్ ద్వారా సమస్యలు లేకుండా చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అన్నింటినీ కొనసాగిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ధరణితో ప్రయోజనం చేకూరిందని, మేం అధికారంలోకి వచ్చాక ప్రజందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. 


బీజేపీ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ మాట్లాడుతూ.. తాము ధరణిని రద్దు చేసేది లేదన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని పైకి లేపడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డబ్బు అందించారని ఆరోపించారు. సారు, కారు 60 పర్సంటేజీ అన్నట్లుగా తెలంగాణ సర్కార్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. 


నిన్న మొన్నటివరకూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై, ధరణి వెబ్ సైట్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని, కేసీఆర్ ప్రజలకు ఏమీ చేయలేదని, అంతా అవినీతేనని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తో పాటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదే పదే చెప్పారు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్న రాష్ట్ర బీజేపీ చీఫ్.. తాము అధికారంలోకి వచ్చాక ధరణితో పాటు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ తనకు పాత మిత్రుడేనంటూ చెబుతూనే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను పైకి లేపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపెంచేందుకు కేసీఆర్ యత్నించారని గతంలోనూ ఆరోపించారు.