పట్టపగలు ఓటుకు నోటు కేసు (Cash For Vote)లో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని, మరోసారి అమర్యాదగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా అంటూ సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జోగు రామన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను, తన ఇంటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే... బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను కాబట్టే ఓర్వలేక అవమానిస్తున్నారని అన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
గతంలో రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు నౌకరుగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోట్లు విషయాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం ఆయన ఒంటెద్దు పోకడలతో విర్రవీగుతున్నారని అన్నారు. అభివృద్దే పరమావధిగా దూసుకెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగుతుందన్న రేవంత్ రెడ్డి మాటలకు స్పందించిన ఆయన... ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా అని సవాల్ విసిరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షలాది ఉద్యోగాలను కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ ల నాయకత్వంలో రాష్ట్రం అభ్యున్నతి పథంలో దూసుకెళ్తొందని అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడి నేతలు సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి స్థాయి వ్యక్తికి గ్రహ నిర్మాణశాఖ మంత్రి ఎవరో తెలియకపోవడం హాస్యాస్పదమని జోగు రామన్న అన్నారు. తన హయంలో నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి బాటలో నడుపుతున్నానని స్పష్టం చేశారు. తన ఇంటిపేరును వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆయనతో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి , జిల్లా రైతు బంధు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, అదిలాబాద్ పట్టణ అధ్యక్షులు అలాల అజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.