Telangana Minister Sridhar Babu | హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొదట శాసనసభ, తరువాత శాసన మండలి సెషన్ ముగిసింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వారం రోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాలు ముగిశాయి. మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు శాసనసభ జరిగింది. మొత్తం సభ్యులలో 71 మంది సభ్యులు సభలో మాట్లాడారు. శాసనమండలి 28.3 గంటలు జరగగా, మండలిలో సభ్యులు 38 ప్రశ్నలు వేయగా వాటికి సంబంధిత సభ్యులు సమాధానం ఇచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో 8 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది అని పేర్కొన్నారు.


అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులివే..


పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, భూ భారతి 2024, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ సవరణ బిల్లుకు ఈ సమావేశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.


‘గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, తెలంగాణ ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర టూరిజం పాలసీ, రైతు భరోసా లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాం. మహిళా యూనివర్సిటీ (Telangana Wome University)కి గత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వీరనారి చాకలి ఐయిలమ్మ పేరిట మహిళ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించింది. తెలంగాణ తల్లి విగ్రహం (Telagnana Talli Statue)పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సభ నిర్వహణపైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ సభ్యులకు లేదు. తెల్లవారుజామున 3 గంటల వరకు మేం సభను నడిపాం. మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. మేం ఎక్కడా పారిపోలేదు. శిక్షణా తరగతులకు రాకుండా బీఆర్ఎస్ పారిపోయింది. శిక్షణా తరగతులకు గైర్హాజరుతో స్పీకర్, మండలి ఛైర్మన్ పైన బీఆర్ఎస్ సభ్యులకు ఉన్న గౌరవం ఏంటో తేలిపోయింది.


ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పాం. ఇప్పుడు అసెంబ్లీలో తెలంగాణ భూభారతి చట్టాన్ని ప్రవేశ పెట్టి, ఆమోదింపచేశాం. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్ల బిల్లును తీసుకొచ్చాం. ప్రతిపక్ష పార్టీ సభ్యుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్లాం. ప్రజాస్వామిక పద్దతిలో యేడాది నుంచి ఒక్క సస్పెన్షన్ లేకుండా సభను నిర్వహించాం. 


అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు మొత్తం 6.23 గంటలు మాట్లాడారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు 5.6 గంటలు మాట్లాడగా, బీజేపీ సభ్యులు 3.20 గంటలు, ఎంఐఎం సభ్యులు 3.39 గంటలు మాట్లాడగా, సీపీఐ సభ్యుడు కూనంనేని 1.56 గంటలు సభలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వరని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. దీనిపై సభలో అన్ని పక్షాల అభిప్రాయం తీసుకున్నాం. ప్రతిపక్షం కోరిక మేరకు గురుకులాల్లో సదుపాయాల పైన చర్చించాం. 



Also Read: Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి



హైడ్రా పై ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, ప్రతిపక్షాల అనుమానాలకు సభలో సమాధానం ఇచ్చింది. మూసి ప్రక్షాళన లో పేదలకు అన్యాయం జరగనివ్వమని  స్పష్టం చేశాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాలు నిర్వహించాం. స్పీకర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఖండిస్తున్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు 6 గంటలు మాట్లాడితే, బీఆర్ఎస్ నేతలు 5 గంటలు మాట్లాడారు. కానీ స్పీకర్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, కాగితాలు విసరడం వల్లనే వల్లనే మార్షల్స్ ను సభలో మోహరించాం. 


 గత ప్రభుత్వం పెట్టిన నిబంధనలే అసెంబ్లీలో ఉన్నాయి. బీఆర్ఎస్ సభ్యులు వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే పాటించలేదు. సభను కొంత మంది సభ్యులు అడ్డుకున్నా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాలా ఓపిక గా వ్యవహారించి, చర్యలు తీసుకోకుండా అవకాశం ఇచ్చారు. ఎంత పెద్ద వారైనా మానవీయ కోణం మరిచిపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ ముఖ్యమే. వారి అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నాం. కానీ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేయడం వాస్తవం అన్నారు...