BRS mlas detained at Gun park in Hyderabad | హైదరాబాద్: గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న మహిళల్ని అవమానించారు, ఈరోజు సభ్యులను గౌరవం లేకుండా దూషిస్తూ మాట్లాడారని.. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం రాత్రి గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. 


 మాజీ మంత్రి ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ఫైర్
శాసన సభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. హైదరాబాద్ నగరంపై మీద చర్చ జరుగుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ ఏంటని అడిగితే బీఆర్ఎస్ అడ్డుకుంది అంటున్నారు. స్పీకర్ మాకు చాల నీతులు చెప్పారు, ఈరోజు దానం నాగేందర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.


శాసన సభలో కాంగ్రెస్ సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన అవమానకరంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25 కోట్లతో జోడేఘాట్ ను మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారు , మెడికల్ కాలేజీలు పెట్టినట్లు మీకు కనిపించడం లేదా, అవగాహన లేకుండా వెడ్మ బొజ్జు జోడేఘాట్ గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.  ‘4 లక్షలకు పైగా అటవీ భూములకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్. బీఆర్ఎస్ అధినేతకు మాత్రమే ఫాం హౌస్ ఉందా, కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఫాం హౌస్ లు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ పెద్ద బోగస్, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు మోసం చేశారు. సిగ్గు శరం ఉంటే దానం నాగేందర్ కు  వెంటనే రాజీనామా చేయాలి. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డే అన్నాడు. కానీ స్వయంగా రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంటున్నాడు. అసెంబ్లీ అంటే దేవాలయం, అలాంటి చోట దానం నాగేందర్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మరోవైపు అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు’ అని కోవా లక్ష్మీ అన్నారు.