Telangana Assembly Sessions begins from August 30 | హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. దానికి ఒకరోజు ముందు ఈ 29న రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇదివరకే చర్చించిన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది. మరుసటి రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సమావేశాలు ప్రారంభమయ్యే రోజున ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సభ్యులు సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉపసభాపతి ఎన్నిక నిర్వహిస్తారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నందున అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల రాగం అందుకున్నాయి. దాంతో త్వరలో జరగనున్న ఈ సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై విపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నాయి.