హైదరాబాద్: తెలంగాణలో రేషన్ దుకాణాల డీలర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన కమీషన్లు చెల్లించకపోతే రేషన్ దుకాణాల మూసివేతకు సైతం వెనుకాడటం లేదు. ఆగస్టు నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న కమీషన్లు చెల్లించకపోతే, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను మూసివేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు హెచ్చరించారు.
ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల భవన్ ఎదుట డీలర్లు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత 5 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తమకు కమీషన్లు చెల్లించలేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా పౌర సరఫరాల అధికారి మురళీకృష్ణకు వినతిపత్రాన్ని సమర్పించారు. కమీషన్లు చెల్లించకపోతే తాము ఎలా బతకాలని, తమ కుటుంబాల గురించి ఆలోచించి ప్రభుత్వం వెంటనే బకాయి పెట్టిన కమీషన్లు చెల్లించాలని కోరారు.