Telangana Assembly Elections 2023:


హైదరాబాద్‌: నవంబర్ 7, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. అయితే రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రానికి ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సాధ్యమైనంత త్వరగా బిల్లు పాస్‌ చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు రానున్న మోదీని బీఆర్ఎస్ నేతలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్నారంటే.. వారు తెలంగాణకు ఏం చేశారు, తాము అడిగినట్లు ఏ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు అని ప్రశ్నించడం పరిపాటిగా మారింది.


మంత్రి హరీష్ రావు ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన మాదిగల యుద్ధభేరి సభ (ఎమ్మార్పీఎస్ సభ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రానికి పంపించామని చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారుకు ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి లేదని, ఈ విషయంపై తాత్సారం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రానికి లేని ఇబ్బంది కేంద్రానికి ఏంటని ప్రశ్నించారు. మాదిగల ఆత్మగౌరవం పెరగాలి. హైదరాబాద్ లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరగా హరీష్ రావు అందుకు అంగీకరించారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి మాదిగల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.


దళితులలో అర్హులకు రూ.10 లక్షలు అందించి వారిని అభివృద్ధి చేయాలని దళితబంధును సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డ తరువాత రాష్ట్రంలో 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామన్నారు. అయితే రాష్ట్రంలో భూమి కొరత కారణంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయామని చెప్పారు. అందువల్లే వారి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


తెలంగాణలో మోదీ పర్యటన షెడ్యూల్.. 
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోడీ  హాజరుకానున్నారు. ఈ 11వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్య అతిథిగా మోదీ రాబోతున్నారు. నాలుగు  రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రధాని రాష్ట్రానికి రానుండటం ఆసక్తి కలిగిస్తోంది. కానీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో మరోసారి రాజకీయం హీటెక్కనుంది. గత నెలలో నిజామాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని సంచలన ఆరోపణలు  చేశారు. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలని.. కేసీఆర్‌ తనను అడిగగా, తాను ఒప్పుకోలేదని మోదీ సంచలన విషయాలు చెప్పారు. ఎన్డీయేలో చేరేందుకు కూడా కేసీఆర్‌ సిద్ధం కాగా, అందుకు తాను ఒప్పుకోలేదంటూ మరో సంచలనానికి తెరలేపారు.