అటవీ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. దేశంలోనే మొదటిసారిగా అటవీ విద్య కోసం ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంద్రకరణ్‌రెడ్డిని అభినందించారు. 


అడవుల రక్షణ, పచ్చదనం పెంపునకు హరితహారంతో పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2015 నుంచి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా హరితహారం కొనసాగుతోంది. మిగతా సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI)ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలేజీని యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో ములుగు వద్ద (సిద్దిపేట జిల్లా) అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతోపాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్దంగా ఉంది.


దీనికి సంబంధించిన మరో కీలక అడుగు పడింది. తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అటవీ వనరుల పరిరక్షణ, ఉద్యాన పంటల అభివృద్ధి, పరిశోధనకు ఈ యూనివర్శిటీ ఉపయోగపడుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సంప్రదాయ అటవీసాగను ప్రోత్సహించడం, అడవులపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా పరిశోధనలు చేయడం ఈ యూనివర్శిటీ బాధ్యత అని వివరించారు. హరితహారం, ప్రకృతివనాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, నర్సరీలు, హరితనిధి కార్యక్రమాలతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచుతున్నామని పేర్కొన్నారు. 


ఈ యూనివర్శిటీలో పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్త్ర కోర్సులతోపాటు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని రూపొందించాలని ప్రతిపాదించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. అటవీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. త్వరలోనే తొలి వీసీని చాన్స్‌లర్‌ నియమించనున్నారు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా జరుగుతుంది. సోమవారం ప్రవేశపెట్టిన బిల్లుపై నేడు చర్చించి ఆమోదించారు.