AP TS Issues : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం కీలక సమావేశం నిర్వహించనుంది. విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ ఈ నెల 27 సమావేశం నిర్వహిస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పలు అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్రం చర్చించనుంది. ఈ సమావేశంలో విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం అందించే సహకారంపై చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపై ఈ సమావేశంలో చర్చకు రానుంది. ఏపీ, తెలంగాణ మధ్య ఆర్థికపరమైన అంశాలపై చర్చించనున్నారు.  ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న విషయంపై కేంద్ర హోంశాఖ ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. 


కొత్త రాజధాని ఏర్పాటుకు సహకారం 


కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరితో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్‌ సహా వివిధ శాఖల అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఏపీ ప్రభుత్వం ప్రధాన హామీ మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రస్తావించలేదు. నూతన రాజధానికి నిధులు కేటాయింపులు అని మాత్రమే తెలిపింది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్‌ రైల్‌ అనుసంధానంపై చర్చించాలని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖలతో పాటు దాదాపు తొమ్మిది శాఖల అధికారులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు సంబంధించి కొలిక్కి రాని అంశాలపై చర్చించేందుకు హోంశాఖ అజెండాలో పేర్కొంది. వీటితో పాటు సింగరేణి కాలరీస్‌, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌కు సంబంధించిన రెండు సంస్థలు, పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చించే అవకాశం ఉంది.  


విద్యుత్ బకాయిలపై వివాదం 


 ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించింది. రూ.3,441.78 అసలు లేటే పేమెంట్ ఫీజు రూ. 3,315.14 అదనంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ విద్యుత్ బకాయిల చెల్లింపు వివాదం ఇప్పటిది కాదు. 2017 నాటిది. విభజన చట్టంలో చెప్పారని చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంటి తెలంగాణకు మూడేళ్ల పాటు కరెంట్ సరఫరా చేసింది. అయితే దానికి డబ్బులు చెల్లించకపోవడంతో నిలిపివేసింది. ఆ మూడేళ్ల పాటు సరఫరా చేసిన దానికి ఇంత వరకూ డబ్బులు చెల్లించలేదు. ఆ డబ్బులు ఇవ్వాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటి జగన్ ప్రభుత్వం కూడా తెలంగాణను కోరుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం స్పందించి కట్టాలని తెలంగాణను ఆదేశించింది. 


తెలంగాణ వాదన 


ప్రస్తుతం కేంద్రం కట్టాలని ఆదేశించినవి కాకుండానే ఏపీ నుంచి తమకు రూ. 12, 490 కోట్లు రావాలని తెలంగాణ వాదిస్తోంది.  2017లో ఏపీ ఉద్దేశపూర్వకంగానే పీపీఏలను పట్టించుకోకుండా.. థర్మల్‌ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయకుండా నిలిపివేసింది. ఆ లోటును పూడ్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును తెలంగాణ కొనుగోలు చేసింది. దీనివల్ల కలిగిన అదనపు భారానికి సంబంధించి బకాయిలు అలాగే జల విద్యుత్తు , మాచ్‌ఖండ్‌, టీబీ డ్యాం విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణకు అయిన అదనపు ఖర్చు వడ్డీతో కలిపి రూ.6639 కోట్లు ఉంటుందని తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. అలాగే రాష్ట్ర విభజన సమయంలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వడ్డీతో కలుపుకొంటే రూ.3,819 కోట్లు ఉన్నాయి. అలాగే పవర్‌ పర్చేజ్‌కు సంబంధించి ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.6,639 కోట్లు చెల్లించాలి. ఏపీ ట్రాన్స్‌కో నుంచి రూ.1,730 కోట్లు రావాలి. దీనితోపాటు ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణకు రూ.4,026 కోట్లు రావాలని చెబుతున్నారు. ఇక కృష్ణపట్నం థర్మల్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.1,614 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుని ఏపీకి ఇవ్వాల్సింది తీసేస్తే రూ.12 వేల 490 కోట్ల కంటే ఎక్కువే ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది. 


Also Read : పాదయాత్రగా వస్తున్న వారికి నిరసన తెలపండి- ఉత్తరాంధ్ర ప్రజలకు వైసీపీ నేతల పిలుపు