Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి (ఫిబ్రవరి 13)కు వాయిదా పడ్డాయి. నేటి సభలో నీటిపారుదల విషయంలో మంత్రి ఉత్తమ్ ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపారు. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో భాగంగా సాగునీటి విభాగాన్ని భ్రష్టుపట్టించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అంతేకాక, అప్పట్లో నీటిపారుదల శాఖ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ రాసిన లేఖను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి వినిపించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు తాము అంగీకరిస్తున్నామని ఆ లేఖలో రాసినట్లుగా ఉత్తమ్ చదివి వినిపించారు. అయితే, చర్చ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానంపై కాక.. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీదకు కూడా మళ్లింది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలు కాలరాసేలా రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభం చేశారని.. అందుకే కేసీఆరే సహకరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం క్లిప్ ను కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శింపజేసింది. ఆ క్లిప్పింగ్ లో సీఎం జగన్ మాట్లాడిన ప్రకారం.. తెలంగాణ నుంచి వాళ్లు నీళ్లు కిందకి వదిలితే తప్ప, మనకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉందనే కేసీఆర్.. ఓ అడుగు ముందుకేసి తెలంగాణ నుంచి నీళ్లు తీసుకునేందుకు ఏపీకి అంగీకారం తెలిపారు. మొత్తం 8 జిల్లాలు.. అందులో రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా నుంచి పశ్చిమ గోదావరి వరకు కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మనం కోరగానే.. తెలంగాణ నుంచి ఏపీ వాళ్లు నీళ్లు తీసుకునేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారంటూ సీఎం జగన్ గతంలో మాట్లాడిన విషయాన్ని సభలో చూపించారు. ఏపీకి ఇచ్చినందుకు సీఎం జగన్ అప్పటి కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పడం కూడా అందులో ఉంది.
దీంతో తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను కేసీఆర్ ఏకపక్షంగా ఏపీకి ఇచ్చేశారని.. తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. చర్చ అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించవద్దని పెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి (ఫిబ్రవరి 12) వాయిదా వేశారు. అయితే, ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీనికి సంబంధించి సభ్యులకు లేఖలు పంపామని.. వ్యక్తిగత ఆహ్వానంగా భావించి అందరూ రావాలని ఉత్తమ్ పిలుపు ఇచ్చారు.
హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లుకూ అసెంబ్లీ ఆమోదం
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా శాసన సభ ఆమోదించింది.