Uttam Kumar Reddy Speech In Telangana Assembly: హైదరాబాద్: కృష్ణా నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ విధానాలు, లోపాల వల్లే జల దోపిడీ జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ స్మితా సబర్వాల్ రాసిన లేఖను ఉత్తమ్ చదివి వినిపించారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు తాము అంగీకరిస్తున్నామని ఆ లేఖలో రాసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. 


తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించింది. ‘తెలంగాణ నుంచి వాళ్లు నీళ్లు కిందకి వదులుతే తప్పా, మనకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉందనే కేసీఆర్.. ఓ అడుగు ముందుకేసి తెలంగాణ నుంచి నీళ్లు తీసుకునేందుకు అంగీకరించారు. మొత్తం 8 జిల్లాలు.. అందులో రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా నుంచి పశ్చిమ గోదావరి వరకు కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మనం రిక్వెస్ట్ చేయగా తెలంగాణ నుంచి ఏపీ వాళ్లు నీళ్లు తీసుకునేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని’ ఏపీ సీఎం జగన్ గతంలో మాట్లాడిన విషయాన్ని సభలో ప్రదర్శించారు. మన నీళ్లు ఏపీకి ఇచ్చినందుకు సీఎం జగన్ అప్పటి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను కేసీఆర్ ఏకపక్షంగా ఏపీకి ఇచ్చేసి, రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు.


 






అవి గోదావరి జలాలు కాదు..
గోదావరి జలాల గురించి ఏపీ సీఎం జగన్ మాట్లాడిన విషయాలను కృష్ణా జలాలుగా చిత్రీకరించి సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే మంత్రి ఉత్తమ్ స్పందించి అది కృష్ణా జలాల విషయమని క్లారిటీ ఇచ్చారు. కృష్ణా ఆయకట్టు అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారని, అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ నుంచి ఏపీకి ఏకపక్షంగా ఇచ్చేశారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాలు ఏపీ నేతలు తీసుకెళ్తే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. కనుక ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు.  


ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందన్న హరీష్ రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కృష్ణా నదీ జలాలలపై మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలపై అభ్యంతరం తెలిపారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తిగా అసత్యమైన ప్రజెంటేషన్ ఇచ్చారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శలు వస్తున్నాయి.