BRS Mla Harish Rao Hot Comments in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తీవ్రమైంది. కృష్ణా నదీ జలాలు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే.. మహబూబ్ నగర్ వాసులు ఎంపీగా గెలిచారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'పదేళ్లు జరిగిన పాపాలకు కారణం కేసీఆరే. ఆయన పాపాల భైరవుడు. కృష్ణా జలాల్లో ఎవరు వాటా అమ్ముకున్నారు? ఎవరు విందుకు అవకాశమిచ్చారు. కేసీఆర్ ను సభకు రమ్మనండి. ఎంతసేపు మాట్లాడుతామన్నా మైక్ ఇస్తాం. ఆయన అడిగిన వాటికి సమాధానం చెబుతాం.' అని అన్నారు. సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అన్నారు. ఆయన్ను కొడంగల్ నుంచి తరిమికొడితే.. మల్కాజిగిరి వచ్చారా.? అని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. హరీష్ వ్యాఖ్యలపై మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం తెలిపారు. 


కోమటిరెడ్డి Vs హరీష్ రావు


తొలుత కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం గత ప్రభుత్వం విధానాలు, లోపాల వల్లే జల దోపిడీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తిగా అసత్యమైన ప్రజెంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలగజేసుకుని ఏపీ సీఎం జగన్ స్టేట్ మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు సరికావని.. అమేథీలో రాహుల్ ను కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు.


కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యం వల్ల వ్యవసాయం సంగతి పక్కన పెడితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. జగదీశ్ రెడ్డికే ముఖం చెల్లకే నేడు సభకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన నల్గొండ సభకు రావాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ను అలా అనడం సరికాదని.. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హరీష్ రావు తీరును తప్పుబట్టారు. వాద ప్రతివాదనలతో అసెంబ్లీలో హీట్ వాతావరణం నెలకొంది.


Also Read: Telangana Assembly: 'కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం లేదు' - జల దోపిడీ అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ ప్రకటన