Telangana Assembly Session on KRMB Issue: కృష్ణా నదీ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 'గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గి డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలను అదనంగా ఏపీ ప్రభుత్వం తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు - రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీలే క్లెయిమ్ చేశారు. ఇప్పుడు 50 శాతం కావాలని అడుగుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైఎస్ హయాంలో 44 వేల క్యూసెక్కులను 2020లో ఏపీ సీఎం జగన్ 90 వేలకు పెంచారు. అయినా అప్పటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు.' అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు 'కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు' పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. గతంలో కేసీఆర్ పాలనలో తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణ శాపాలయ్యాయని పేర్కొంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. 'ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపింది. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు.' అని విమర్శించారు.
'కేసీఆర్ ను జగన్ పొగిడారు'
నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ పాలకులది అసమర్థతో.. అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఢిల్లీ వెళ్లి 512.299 టీఎసీలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారు. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం 203 జీవో ఇచ్చి రోజుకు 3 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ పూర్తైతే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తోంది. ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి పరోక్షంగా సహకరించారు. కావాలనే ఆయన అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు కాలేదు. అప్పుడు సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2013లోనే ప్రాజెక్ట్ పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి' అని ఉత్తమ్ అన్నారు.