Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో ఏసీబీలో నమోదైన కేసులపై విచారణలో భాగంగా ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో పలు కీలక ఫైళ్లు, దస్త్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అవకతవకల విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు, సెక్రటరీల పాత్ర గురించి ఆరా తీశారు. ఇందుకోసం ప్రస్తుత సభ్యులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధులు గోల్ మాల్ జరిగినట్లుగా ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అలా 2023 అక్టోబరులో హెచ్సీఎపై నాలుగు కేసులు ఉప్పల్ లో నమోదయ్యాయి. 2019- 2022 మధ్య అపెక్స్ కౌన్సిల్ ఉన్న సమయంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, వాటిని ఖర్చు చేసిన విధానం, టెండర్లు పిలిచిన తీరు, కొటేషన్లు వంటివాటిపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో అవకతవకలు గుర్తించారు. దీంతో ఫిర్యాదు నమోదైంది. 2019- 2022 మధ్య హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉండేవారు. ఉపాధ్యక్షుడిగా జాన్‌మనోజ్, సెక్రటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్ శర్మ, ట్రెజరర్ గా సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉండేవారు.