Teenmaar Mallanna Telangana Nirmana Party: తెలంగాణలో మరో కొత్త పార్టీకి రంగం సిద్ధమైంది. జైలు నుంచి విడుదలైన జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తాను తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు. మంగళవారం రాత్రి చర్లపల్లి జైలు ముందే పార్టీ పేరు ప్రకటించారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తాం అన్నారు. క్యూ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న తాను కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బలహీన వర్గాల తరఫున తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినిపించకోకుండా చేస్తామన్నారు తీన్మార్ మల్లన్న.


తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం.. 
జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్నకు క్యూ న్యూస్ సిబ్బంది, ఆయన అభిమానులు పూల దండలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేవలం పోలీసులను నమ్ముకుని, వారి మీద ఆధారపడి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు జరిగాయిని, బాధితులు ఫిర్యాదు చేస్తే బాధితులనే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తీన్మార్ మల్లన్నను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. తనను జైల్లో వేసిన కేసీఆర్ కు కొన్ని నెలల్లో అన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని.. తీన్మార్ మల్లన్నకు జైలు కొత్త కాదన్నారు. గతంలో, ఇప్పుడు తాను జైల్లో దాదాపు 100 రోజులు గడిపినట్లు చెప్పారు. చర్లపల్లి జైలు ముందే తన స్థాపించనున్న పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని ప్రకటించారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారని, కానీ ఎట్టకేలకు తాను విడుదలయ్యానని.. తన పోరాటం కొనసాగుతుందన్నారు. 


కల్వకుంట్ల కవిత సైతం తనలాగే కేసుల విచారణ ఎదుర్కోవాలన్నారు. ఆమె కిందపడితే గాయాలయ్యారని, ఆమె త్వరగా కోలుకోవాలని తీన్మార్ మల్లన్న ఆకాంక్షించారు. మహారాష్ట్రలో రాజకీయాలు చేయడానికి తెలంగాణలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. తనపై నమోదైన అక్రమ కేసులపై చట్టపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు తనకు మద్దతు తెలిపారని, వీరి బాగు కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.


మల్కాజ్ గిరి కోర్టు నిన్న బెయిల్ మంజూరు 
తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు.... ఒక్కొక్కరికి రూ.20 వేలు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల కానున్నారు. తీన్మార్ మల్లన్నకు రెండు కేసుల్లో సాధారణ బెయిల్ ఇచ్చింది కోర్టు.  బెయిల్ కోరుతూ తీన్మార్ మల్లన్న మల్కాజ్ గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు... తుది తీర్పును ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. అదేవిధంగా ఏప్రిల్12న రెండో కేసు బెయిల్ పిటిషన్ పై మల్లన్న న్యాయవాది కోర్టుకు వివరాలు సమర్పించారు. అదే రోజు బెయిల్ పై ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే బెయిల్ పై తుది తీర్పును ఏప్రిల్ 17న ఇస్తామని గతంలో కోర్టు తెలిపింది. దీంతో ఇవాళ తుది తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి.  తీన్మార్‌ మల్లన్నపై తెలంగాణ వ్యాప్తంగా 90 కేసులు పెట్టారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా తన భర్తను అరెస్ట్‌ చేశారని మల్లన్న భార్య మమత ఏప్రిల్‌ 3న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.