Tamilisai Soundarrajan: చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయొద్దని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలని... ఉపాధ్యాయులు సైతం ఎంజాయ్ చేస్తూ బోధించాలని సూచించారు. వికారాబాద్ లోని మాజీ మంత్రి చంద్రశేఖర్ కు చెందిన బృంగీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే చదువు రాదని, ఇష్టంతో చదివితేనే చదువు వస్తుందని ఆమె తెలిపారు. ప్రతీ ఒక్కరూ తమ పిల్లలే క్లాస్ ఫస్టు రావాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చదువుల్లో సమూల మార్పుల కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో భారత ప్రధాని చొరవతో మన దేశంలోనే శాస్త్రజ్ఞులు వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు సరఫరా చేసే విధంగా కృషి చేశారన్నారు. 






ఆటలు ఆడేలా పిల్లల్ని ప్రోత్సహించాలి 
విద్యార్థుల్లో శారీరక ధృడత్వం పెరిగేలా ఆటలు ఆడేలా ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై తల్లిదండ్రులకు సూచించారు. అలాగే పిల్లలకు కూడా క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టాలని వివరించారు. ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుందన్నారు. శారీరకంగా బలంగా ఉంటూనే.. చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఆలోచించి పిల్లలను ఒత్తిడికి లోనుకాకుండా ఎంజాయ్ చేస్తూ చదువుకునే లా ప్రోత్సహించాలని గవర్నర్ తమిళి సై వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పిల్లలకు నచ్చిన రంగంలో వాళ్లు ఎదిగేలా చేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.