Cat Steal Case : హైదరాబాద్ వనస్థలిపురంలో పిల్లి చోరీకి గురైందంటూ ఓ కేసు నమోదు అయింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని జంగీర్ నగర్ లో ఉంటున్న ఓ వ్యక్తి తన పెంపుడు పిల్లిని చోరీ చేశారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  పిల్లి చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  తాను ఎంతో ఇష్టంగా, అపూరూపంగా పెంచుకుంటున్న పిల్లిని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లాడని పిల్లి యజమాని పీఎస్ లో ఫిర్యాదు చేశారు.  


అసలేం జరిగింది? 


వనస్థలిపురం జహంగీర్ నగర్ కాలనీకి చెందిన మహమూద్ అనే వ్యక్తి 18 నెలల క్రితం ఓ తెల్ల పిల్లిని తీసుకొచ్చి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఆ పిల్లి అంటే ఇంట్లో వారందరికీ ఎంతో ఇష్టం, కుటుంబంలో ఓ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అయితే జనవరి 8వ తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయంలో స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి, మహమూద్ ఇంటి వద్ద ఉన్న పిల్లిని తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పిల్లి కనిపించకపోవడంతో మహమూద్ పరిసరాల్లో వెతికాడు. చుట్టుపక్కల ఎక్కడా పిల్లి జాడ కనిపించకపోవడంతో సీసీ కెమెరాలో చెక్ చేశారు. దీంతో పిల్లి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చోరీకి గురైన పిల్లి అరుదైన హౌ మనీ రకానికి చెందిందని మహమూద్ అంటున్నారు. ఆ పిల్లికి ఒక కన్ను బ్లూ, మరో కన్ను గ్రీన్ రంగులో ఉండటం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ పిల్లి ఖరీదు సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని చెప్పారు.  


రూ.2 కోట్ల చోరీ కేసు 


 వనస్థలిపురంలో అర్ధరాత్రి రూ.2 కోట్ల డబ్బు తీసుకుని వెళ్తుండగా దోపిడీ దొంగలు ఎటాక్ చేసి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారని ఇటీవల బార్ యజమాని వెంకట్రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదంతా నిజమేనని జనాలతోపాటు పోలీసులు అనుకున్నారు. కానీ తమదైన స్టైల్లో ఇంటరాగేషన్ చేసిన కాప్స్ ఇదంతా హవాలా మాయా అంటూ అసలు నిజం తేల్చారు. శుక్రవారం రాత్రి వనస్థలిపురంలో ఓ దోపిడీ కేసు వెలుగుచూసింది. వనస్థలిపురంలోని ఎంఆర్ఆర్ బార్ యాజమాని కలెక్షన్ సొమ్ముతో ఇంటికి బయల్దేరాడు. గుర్తు తెలియని దుండగులు తనను ఫాలో అయ్యి..వెంకట్రామిరెడ్డి బైకును ఢీకొట్టి డబ్బుతో ఎస్కేప్ య్యారనేది స్టోరీ. దోచుకెళ్లిన సొత్తంతా బారు లావాదేవీలకు సంబంధించిందేనని అంతా అనుకున్నారు. బట్..ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ ఇంత భారీ మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటుందని పోలీసులకు డౌట్ వచ్చింది.  


హవాలా రూపంలో అమెరికా నుంచి రూ.28 కోట్లు 


కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తనదైన స్టైల్లో విచారణ మొదలు పెట్టారు. బాధితుడికి తెలిసిన వ్యక్తులే ఇదంతా చేశారనే అంచనాకు వచ్చారు. దర్యాప్తులో బార్ ఓనర్ వెంకట్రామిరెడ్డి కాల్ డేటా, వాట్సప్ హిస్టరీపై ఓ కన్నేశారు. అప్పుడు అసలు గుట్టు బయటపడింది. హవాలా బాగోతం వెలుగులోకి వచ్చింది. బార్ ఓనర్ వాట్సప్ ఆధారంగా హవాలా లింకులు గుర్తించారు పోలీసులు. ఓల్డ్ సిటీకి చెందిన ఫరూఖ్ తో కలిసి వెంకట్రామిరెడ్డి హవాలా చేస్తున్నాడని గుర్తించారు. బార్ ఓనర్ వెంకట్రామిరెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. హవాలా లావాదేవీలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఫరూఖ్ తో వెంకట్రామిరెడ్డికి లింకులున్నట్టు తేల్చారు. ఓ ఎన్నారై పంపిస్తున్న డబ్బులు హైదరాబాద్లో చేతులు మారుస్తున్నట్టు కాప్స్ గుర్తించారు. ఇప్పటివరకు  అమెరికా నుంచి రూ.28 కోట్ల హవాలా రూపంలో మార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న షారుఖ్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరం చేశారు.