హైదరాబాద్‌: ఇటీవల శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు జరిగాయని తెలిసిందే. అయితే నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఘనంగా నివాళులర్పించనున్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కావడంతో ఆయనకు ఘనంగా నివాళి అర్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.   


7 రోజులపాటు సంతాప దినాలు


గత గురువారం మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతి చెందగా.. శనివారం నాడు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో నిర్వహించారు. మన్మోహన్ మృతితో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం 7 రోజులు సంతాపదినాలను పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంతాప దినాల సమయంలోనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా భావించి సభ్యులు అసెంబ్లీకి హాజరు కావాలని సూచించారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో 16వ నియమం కింద ఉన్న రెండో నిబంధన ప్రకారం సభాధిపతి అధికారాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సోమవారం (డిసెంబర్ 30న) ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.


సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం 
మన్మోహన్‌సింగ్‌ మృతిపై నేడు జరిగే సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రొఫెసర్‌గా కెరీర్ ఆరంభించి, ఆపై ఆర్థికవేత్తగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ విశేష సేవలు అందించారు. ఆయన ప్రణాళిక మండలి ఉపాధ్యక్షునిగా, యూజీసీ ఛైర్మన్‌గా, ఆర్‌బీఐ గవర్నర్‌గా దేశానికి అందించిన సేవలను సర్మించుకోనున్నారు.



తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధాని మన్మోహన్‌ కనుక, మనకు అందించిన సహకారంపైనా చర్చించనున్నారు. మన్మోహన్ సింగ్‌కు మృతికి రాష్ట్ర శాసనసభ వేదికగా సంతాపం తెలపనున్నారు. ఆయనకు ఘన నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా శాసనసభ నిర్వహిస్తున్నారు.  తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కావాల్సి ఉండగా.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కారణంగా వాయిదా పడింది. సంతాప దినాల్లోనే మన్మోహన్ కు నివాళి అర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి నిర్ణయం తీసుకున్నారు.


Also Read: Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?