South Central Railway Latest News: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వేశాఖ. ఇప్పటి వరకు తిరుగుతున్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్‌గా మార్చేయనుంది. వంద శాతం ఆక్యుపెన్సీతో నడిచే రైళ్లను రోజూ నడిపించనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ కీలక ప్రకటన చేసింది. కాబట్టి ఆయా మార్గాల్లో నడిచే ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలగనుంది. ఛార్జీల మోత కూడా తప్పనుంది.
ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ట్రైన్స్
పండగులు, ప్రత్యేక సందర్భాల్లో రైల్వే శాఖ ఈ ప్రత్యేక ట్రైన్స్ నడుపుతుంది. రద్దీ తగ్గిన వెంటనే వాటిని రద్దు చేస్తుంది. ఈ ట్రైన్స్‌లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తుంది. వీటి టైమింగ్స్ కూడా వేరుగా ఉంటాయి. అలా నడిపే స్పెషల్ ట్రైన్స్‌లో కొన్నింటినీ సాధారణ రైళ్లు మాదిరిగా రెగ్యులర్‌గా నడపాలని చూస్తోంది.
కరోనా తర్వాత సర్వీసుల్లో మార్పులు
కరోనా తర్వాత రైల్వే శాఖలో చాలా మార్పులు వచ్చాయి. చాలా వరకు రైల్ సర్వీలను నిలిపేశారు. మరికొన్నింటి బొగీలు తగ్గించారు. వందే భారత్ ట్రైన్స్ పట్టాలెక్కించారు. ఇలా చేసిన మార్పులు కారణంగా ప్రయాణికులు కొంత సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నారు. కానీ సమస్యలను కూడా చాలానే ఎదుర్కొంటున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న రైల్వే శాఖ మార్పులు చేర్పులు చేస్తోంది.
అలాంటి మార్పులు చేర్పుల్లో ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్‌ను రెగ్యులర్ ట్రైన్స్‌గా మార్చనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాజిగూడ, నాంపల్లి నుంచి చాలా వరకు స్పెషల్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే శబరిమల వెళ్లే భక్తుల కోసం కొన్ని నడుస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేకంగా సర్వీస్‌లు రన్ చేయనున్నారు. ప్రస్తుతం శబరిమల వెళ్లే యాత్రికుల కోసం 30కిపైగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే.
Also Read: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటే...
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక అవసరాల కోసం వేసే ఈ స్పెషల్ సర్వీస్‌లను రెగ్యులర్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ చూసేందుకు రోజూ బారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆ ట్రైన్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలని భావిస్తోంది.
ఇప్పటి వరకు శబరిమలకు హైదరాబాద్ నుంచి ఒకటే ట్రైన్ నడుస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రైలు వేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పుడు నడుస్తున్న స్పెషల్ ట్రైన్‌లో వంద శాతం ఆక్యుపెన్సీ ఉన్న రైలును రెగ్యులరైజ్ చేస్తారు. షిరిడీ వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అక్కడికి కూడా మరో రెగ్యులర్ ట్రైన్ నడపాలని చూస్తున్నారు.
తిరుపతి వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి వెళ్లే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల ప్రజలు ఉంటున్న హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరస్వామి భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే మరో ట్రైన్‌ను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నారు. ఇప్పటి వరకు తిరుగుతున్న స్పెషల్ ట్రైన్‌ను సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టి రెగ్యులర్‌గా తిప్పుతారు.
ఈ ప్రాంతాలతోపాటు కాకినాడ. విజయవాడ, విశాఖ సహా ఇతర ప్రాంతాలకు రెగ్యులర్ వెళ్లే వాళ్ల కోసం మరికొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్పెషల్‌గా నడిపినప్పుడు కాకుండా మిగిలినటైంలో కూడా రద్దీ కలిగి ఉన్న ట్రైన్స్‌ను రెగ్యులర్ చేయనున్నారు అధికారులు. ఇలా తీసుకురానున్న రెగ్యులర్ ట్రైన్స్‌తోపాటు మరికొన్ని ట్రైన్స్ టైమింగ్స్ మార్చనున్నారు. అందుకే జనవరి నుంచి రైల్వే టైం టేబుల్‌లో మార్పులు కనిపిస్తాయి. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!