Police Arrested Several People In Sandhya Theater Stampede Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నటుడు అల్లు అర్జున్ సహా, సెక్యూరిటీ మేనేజర్, థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 


సంధ్య థియేటర్‌కు సంబంధించిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. 'థియేటర్ యాజమాన్యంలో 8 మంది పార్ట్‌నర్స్ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఘటనకు బాధ్యులే. యజమాని సందీప్, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇంఛార్జీ విజయ్ చందర్, సీనియర్ మేనేజర్ నాగరాజును అరెస్ట్ చేశాం. వారిని చంచల్ గూడ జైలుకు తరలించాం. బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ పరిస్థితి ఆశాజనకంగా ఉంది. భగవంతుడి దయతో బాలుడు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.' అని ఏసీపీ పేర్కొన్నారు.


ఆ రోజు ఏం జరిగిందంటే.?


ఈ నెల 4వ తేదీన రాత్రి 9:40 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో పుష్ప - 2 ప్రీమియర్ షో సందర్భంగా భారీగా అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా చూసేందుకు థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు యత్నించగా తోపులాటలో జరిగింది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని జనం నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీం తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. థియేటర్ యాజమాన్యం కనీసం భద్రతా ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని.. క్రౌడ్ అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ సహా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.


అల్లు అర్జున్ ఆర్థిక సాయం


మరోవైపు, బాధిత కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలుని వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని.. బాధిత కుటుంబానికి పుష్ప టీమ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాజాగా, డైరెక్టర్ సుకుమార్ సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రేవతి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది.


Also Read: Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్