Couple committed suicide along with two children: కుషాయిగూడ పీఎస్ పరిధిలో దారుణం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య.. !
హైదరాబాల్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుషాయిగూడ పీఎస్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. 


అసలేం జరిగిందంటే.. 
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్ మెంట్స్ లో గాదె సతీష్ కుటుంబం నివాసం ఉంటోంది. సతీష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సతీష్ కు వేదతో దాదాపు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు నిషికేత్ (9), నిహాల్ (5) ఉన్నారు. అయితే కొంతకాలం నుంచి ఇద్దరు పిల్లలకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ప్రాణంగా చూసుకుంటున్న పిల్లలను తరచు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని సతమతం అయ్యారు ఆ భార్యాభర్తలు. ఈ క్రమంలో సతీష్, వేద దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 


కుటుంబం మొత్తం చనిపోతే ఏ సమస్యా ఉండదనుకున్నారు. పిల్లల ఆరోగ్యం కుదుట పడటం లేదని, ఆత్మహత్యే వారికి పరిష్కారమని ఆవేదనతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో సతీష్, వేద దంపతులు ముందుగా పిల్లలు నిషికేత్, నిహాల్ లకు విషం (సైనెడ్) ఇచ్చారు. అనంతరం ఆ పిల్లల తల్లిదండ్రులు సైతం విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. గాదె సతీష్ (39), భార్య వేద (35), ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడిఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. విషం తాగి సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం మొత్తం ఆత్మహత్య (Family Commits Suicide) చేసుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. అయితే పిల్లల ఆరోగ్యం బాగుండటం లేదన్న కారణమేనా, ఇతర కారణాలతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు పోలీసులు.


హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం - వ్యక్తి సజీవదహనం 
హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం ఓ సెక్యూరిటీ గార్డు సజీవ దహనం అయ్యాడు. అలాగే ఏడు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 


అబిడ్స్ లోని బొగ్గుల కుంట కామినేని ఆస్పత్రి పక్కనే ఉన్న ఓ కారు మెకానిక్ షెడ్ లో ఒక్కసారిగా మంటలు చెరేగాయి. అగ్నికీలాలు ఎక్కువై షెడ్ మొత్తాన్ని ఆక్రమించాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. స్థానికులంతా పరుగు పరుగున వచ్చారు. వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆలోపే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఏడు కార్లు పూర్తిగా కాలిపోయాయని.. అలాగే కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు సంతోష్ కూడా సజీవ దహనం అయ్యాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.