టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష పేపర్లు వాట్సాప్ ద్వారానే చేతులు మారినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ కమిషన్ కార్యాలయం కేంద్రంగానే మొత్తం వ్యవహారం కొనసాగించినట్లు అంచనాకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, నలగొప్పుల సురేశ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేష్ కుమార్ రిమాండ్ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. మార్చి 22న దర్యాప్తు అధికారులు, ఈ ముగ్గురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఒక ల్యాప్‌టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారికి వాట్సాప్ ద్వారానే ప్రశ్నపత్రాలు చేరినట్టు మొబైల్ ఫోన్ల విశ్లేషణ ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ కేసులో ఏ-12 రమేష్ కుమార్ ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారం సేకరించారు.


ఆధారాల సేకరణపై ఫోకస్..
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏడుగురు నిందితుల కస్టడీ కోరుతూ సిట్ పోలీసులు నగర న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ 12 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. తొలుత అరెస్ట్ అయిన 9 మందిని ఇటీవలే కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. వీరిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, డాక్యానాయక్, రాజేంద్రనాయక్‌లను రెండోసారి ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. వీరితోపాటు... బుధవారం అరెస్టయిన షమీమ్, రమేష్ కుమార్, సురేష్‌లను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయనేది రాబట్టేందుకు మరోసారి వీరిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై శనివారం న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.


విచారణలో పొంతనలేని సమాధానాలు...
గ్రూప్‌-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు వచ్చిన 121 మందిని సిట్ దర్యాప్తు అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 24 వరకు మొత్తం 40 మందిని అధికారులు ప్రశ్నించారు. వీరిలో పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సురేశ్, షమీమ్, రమేష్ కుమార్‌ తడబడ్డారని, పొంతనలేని సమాధానాలిస్తూ దొరికిపోయినట్లు తెలిసింది.


సాక్ష్యాల సేకరణ ఇలా...
* ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేసులో ప్రధాన సాక్షిగా కమిషన్ కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ బి.శంకరలక్ష్మి నుంచి సిట్ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. కమిషన్‌లో జూనియర్ అసిస్టెంట్ కె.అనురాజ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ బి.హరీశ్ కుమార్ నుంచి కూడా సాక్ష్యాలు సేకరించారు. 
* మార్చి 4న హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌స్క్వేర్ హోటల్‌లో రూమ్ నంబరు 106, 107 గదులను నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, డాక్యా నాయక్, రాజిరెడ్డి, మరో ఇద్దరి పేర్లతో అద్దెకు తీసుకుని, మంతనాలు జరిపిన ఆధారాల ఫుటేజిని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఏఈ పేపరు కొనుగోలుకు రూ.7.50 లక్షలకు భేరం?
పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న రేణుక ఇంటిని కూడా మార్చి 24న సిట్ అధికారులు తనిఖీ చేశారు. మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లో ఆమె అద్దెకున్న ఇంటి యజమాని నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నవాబుపేట మండలంలో ఉపాధి హామీ పథకం ఇంజినీరింగ్ కన్సల్టెంటుగా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డిని శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నవాబుపేట ఠాణాలో అర్ధరాత్రి వరకు విచారించారు. నలుగురు వ్యక్తులు రూ.7.50 లక్షల చొప్పున ఇచ్చి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుండగా నవాబుపేటలో ఈసీగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా రూ.7.50 లక్షలకు కొన్నట్లు సమాచారం. అతని కోసం అధికారులు షాద్‌నగర్‌కు వెళ్లగా పరారీలో ఉన్నట్లు తెలిసింది.


పోలీసులను బురిడీ కొట్టించేందుకే..
టీఎస్‌పీఎస్సీ టౌన్‌ప్లానింగ్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదుపై ప్రవీణ్, రేణుకలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాము ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేశామని నమ్మించేందుకు వారు ప్రయత్నించారు. పట్టుకోగానే ఏఈ ప్రశ్నపత్రం లీక్ అయిందని ఒప్పుకోవడం ద్వారా సిట్ అధికారులు అక్కడితో ఆగిపోతారని నిందితులు భావించారు. అయితే తవ్వే కొద్దీ గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు పేపర్లు లీక్ అయినట్లు వెల్లడైంది. ఇక విచారణ సమయంలో ఎంత ప్రయత్నించినా ప్రవీణ్ నోరు మెదపలేదు. తనకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా వచ్చాయన్న విషయాన్ని రాజశేఖర్ వెల్లడించలేదు. శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో పోలీసులే తెలుసుకున్నారు.


రాజశేఖర్ పని ఇలా సులువైంది..
సిస్టమ్‌లో సీక్రెట్‌గా ఉండాల్సిన ఫోల్డర్లకు పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేసుకోకపోవడం, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌కు అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ఈజీగా ఓపెన్‌ చేసినట్టు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 27నే కాకుండా పలుమార్లు ఆమె కంప్యూటర్‌ను రాజశేఖర్‌, ప్రవీణ్‌లు ఓపెన్‌ చేశారని విచారణలో తేలినట్టు సమాచారం. ప్రశ్నపత్రాలుండే కస్టోడియన్‌ సిస్టమ్‌ గురించి పూర్తి అవగాహన ఉండటంతో సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌ గతేడాది జూన్‌ నుంచే గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కోసం ప్రయత్నించాడు. అప్పటికి ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో తిరిగి రెండు మూడు దఫాలుగా ప్రయత్నించి, అక్టోబర్‌ మొదటి వారంలో పేపర్‌ను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు తెలిసింది. అది విజయవంతం కావడంతో ఫిబ్రవరి 27న మరోసారి ఆ సిస్టమ్‌ను ఓపెన్‌ చేసి ఆ ఫోల్డర్‌లో ఉన్న మొత్తం ప్రశ్నలను కాపీ చేశానని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. మరో పక్క ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇండ్లల్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. వారి బ్యాంకు స్టేట్‌మెంట్లు సేకరించారు. మరో మూడు రోజులపాటు నిందితులు సిట్‌ కస్టడీలోనే ఉండనున్నారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...