తెలంగాణలో తీవ్ర రాజకీయా దుమారాన్ని రేపుతున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి తీసుకొచ్చింది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు రామచంద్రభారతి... బీజేపీ నేత సంతోష్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కోర్టుకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.
ఏప్రిల్ 26న రామచంద్రభారతి, బీజేపీ నేత సంతోష్ మధ్య జరిగిన చాటింగ్ వివారలును సిట్ సేకరించి కోర్టుకు ఇచ్చింది. రామచంద్రభారతి... జగ్గు స్వామితో చాటింగ్ చేసినట్టు కూడా గుర్తించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు అడ్వకేట్ శ్రీనివాస్, ప్రతాప్, సింహాయాజీ జరిపిన వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా సిట్ గుర్తించింది.
చాటింగ్‌లను విశ్లేషించిన సిట్.. కీలక విషయాలను కోర్టుకు ఇచ్చిన నివేదికలో పొందుపరిచింది. టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని మాట్లాడుకున్నట్టు గుర్తించింది సిట్.
మొత్తం పాతిక మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. వాళ్లంతా నా సర్కిల్‌కు చెందిన వారేనంటూ బీజేపీ నేత సంతోష్‌కు రామచంద్రభారతి మెసేజ్ చేశారు. ఏప్రిల్ 26న సాయంత్రం ఐదున్నర గంటలకు ఇద్దరి మధ్య ఈ చాటింగ్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. పాతిక మందే కాకుండా మొత్తం నలభై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లంతా తాను ఏం చెప్తే అది చేసేందుకు రెడీగా ఉన్నారని కూడా వెల్లడించారు. ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండానే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు.
అంతే కాకుండా టీఆర్‌ఎస్ కాంగ్రెస్ విలీనం గురించి కూడా నిందితుల మధ్య చాటింగ్ నడిచినట్టు సిట్ వెల్లడించింది. సెప్టెంబర్ 27 రామచంద్రభారతి, జగ్గుస్వామి మధ్య వాట్సాప్‌లో ఈ అంశంపై చర్చ నడిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు జరిగాయని... కేసీఆర్, దిగ్విజయ్ సింగ్ మధ్య ఓ సమావేశం కూడా జరిగిందన్నారు. ఇదే జరిగితే బీజేపీకి చాలా ప్రమాదం ఉందని వాళ్లిద్దరు మాట్లాడుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ తనకు కాంటాక్ట్‌లో ఉన్నారని.. ఆయనకు ఎనిమిది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాట్లాడుకున్నారు. కేసీఆర్ అక్రమాలకు సంబంధించి ఆయనకు చాలా అంశాలు తెలుసని... ఇరవైకిపైగా నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టుందని చాటింగ్ చేసుకున్నారు. ఆయన్ని బీజేపీలో చేర్చుకుంటే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు పెరుగుతాయని వీలైనంత త్వరగా మాట్లాడాలని చాటింగ్‌లో తెలిపారు.
ఇప్పటికే విచారణకు హాజరైన శ్రీనివాస్‌తోపాటుప్రతాప్, విజయ్‌తో నందకుమార్ సెప్టెంబల్ 26 చాటింగ్ చేశారు. పటాన్ చెరు, తాండూరు, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, సంగారెడ్డి, జహీరాబాద్, చేవెళ్ల, పరిగి, మానకొండూరు, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ, ఆందోల్, నారాయణఖేడ్, మహేశ్వరం, బాన్స్‌వాడ, నిజామాబాద్ ఎమ్మేల్యేల ప్రస్తావన వీరి మధ్య వచ్చినట్టు సిట్ తెలిపింది.
అమెరికా వీసా, ప్రతాప్‌కు తన పదవి లాంటి అంశాలను నందు సింహయాజీతో చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్‌ను షేర్ చేసినట్టు సిట్ కోర్టుకు నివేదిక అందించింది.