సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సిట్. 98 పేజీలు ఉన్న ఈ ఛార్జ్‌షీట్‌లో 49 మంది నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. ఈ లీకేజీ కేసులో 1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్టు కోర్టుకు తెలిపింది సిట్.
టీఎస్‌పీఎస్సీ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో న్యూజిలాండ్ ఉన్న నిందితుడితోపాటు 49 మందిని అరెస్టు చేశామని పేర్కొంది. అరెస్టు అయిన వారిలో 16 మంది మధ్యవర్తులుగా తేల్చింది. మిగతావాళ్లు పరీక్ష రాసిన అభ్యర్థులను పేర్కొంది.
అరెస్టు చేసిన 90 రోజుల్లో కేసులో ఛార్జ్‌షీట్ వేయకపోతే నిందితులకు టెక్నికల్‌గా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి అవకాశం నిందితులకు ఇవ్వకుండా ఉండేందుకు సిట్ మధ్యంతర ఛార్జ్‌షీట్ వేసింది. మొదటి నుంచి ఈ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తూనే ఉంది. ఒకరిద్దరే అనుకొని సాగిన దర్యాప్తులో ఇప్పటికే 49 మంది నిందితులగా తేలారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి కేసులో నెలకొంది.
రెండు రోజుల క్రితం ఈ కేసులొ మహ్మద్ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈయన ఏఈ పూల రమేష్ వద్ద కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. ఖాలీద్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ కేసులో అరెస్టు అయిన విద్యుత్ శాక ఏఈ పూల రమేష్‌తోపాటు అరెస్టైన ప్రశాంత్, మహేష్ నరేష్, శ్రీనివాస్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వీళ్లంతా చాట్‌జీపీటీ సహకారంతో సమాధానాలు రాశారు. వీళ్లను కస్టడీలోకి తీసుకొని సిట్ అధికారులు విచారించారు. ఆరు రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది కోర్టు.