Sintex: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వరుస కడుతున్నాయి. తాజాగా మరో భారీ పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. సింటెక్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్.. తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. సింటెక్స్ తయారు యూనిట్ నెలకొల్పడం ద్వారా సుమారు వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 


రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ తయారీ యూనిట్ నుంచి సింటెక్స్ కంపెనీ వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటో కాంపోనెంట్స్ సహా ఇతర పరికరాలను తయారు చేయనుందని అధికారులు చెబుతున్నారు. సింటెక్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని వెల్ స్పన్ కంపెనీ ఛైర్మన్ బీకే గోయెంకా, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు.


అయితే.. వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తమ కంపెనీని మరింత విస్తరించే ఉద్దేశంతో మరో తయారీ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థను కేటీఆర్ అభినందించారు. వెల్ స్పన్ గ్రూపు భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో మరో రూ.350 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఉన్న మౌలిక వసతులు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు.. మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.