హుస్నాబాద్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు వద్ద మూడు రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సందర్శించి, వారి దీక్షకు సంఘీభావం తెలిపారు. చాడ వెంకటరెడ్డితో పాటు, మున్సిపల్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు న్యాయవాదుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతమన్నారు. ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదులు తమ కోసం కాకుండా ప్రజల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
హుస్నాబాద్ సబ్ కోర్ట్ ఏర్పాటు విషయంలో పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావడం సంతోషంగా ఉందని, సబ్ కోర్టు మంజూరు విషయమై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు లతో మాట్లాడడంతోపాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా మాట్లాడి సబ్ కోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుండి మాట వస్తేనే సబ్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సబ్ కోర్ట్ విషయమై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మాట్లాడతానన్నారు. ఇదివరకు హుస్నాబాద్ కు ఏదైనా కావాలంటే పట్టిన పట్టు అయ్యేదాకా వదలలేదని, సబ్ కోర్ట్ ఏర్పాటు కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని, అందరికంటే సిపిఐ పార్టీ తరపున తాను ఒక అడుగు ముందే ఉంటానని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 7న చలో రాజ్ భవన్ కు పిలుపు
దేశంలో గవర్నర్ వ్యవస్థ అద్వానంగా తయారైంది, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల డిసెంబర్ 7న చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు చాడ వెంకట్ రెడ్డి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో నేరపూరిత చరిత్ర కలిగి ఉన్న 5907 ఎమ్మెల్యేలు, మాజీ ప్రతినిధుల కేసులలో న్యాయవ్యవస్థ సత్వరమే తీర్పులివ్వాలన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఎర కేసు లో టీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో, దెబ్బకు దెబ్బగా రాష్ట్ర మంత్రుల ఆస్తులపై ఐటి దాడులను చేయిస్తూ బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదం అంచుల్లో ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకై టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాం, టీఆర్ఎస్ కు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది, వామపక్షాలను అర్థం చేసుకోనేల వ్యవహరించాలని గులాబీ శ్రేణులకు సూచించారు.