కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిపై తీవ్రమైన కామెంట్స్ చేసిన ఆ పార్టీ లీడర్ అద్దంకి దయాకర్‌కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చేసిన కామెంట్స్‌కు సమాధానం చెప్పాలని ఆదేశించింది. వారంలో రోజుల్లో షోకాజ్ నోటీస్‌కు రిప్లై ఇవ్వాలని సూచించింది. తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు ఒకదాని వెంట ఒకటి వరుసగా వస్తూనే ఉన్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారని  ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. సీనియర్ నేతలు కూడా సీరియస్‌ అయ్యారు. దీంతో టీపీసీసీ షోకాజ్ నోటీస్‌లు ఇచ్చింది. 


కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా అద్దంకి దయాకర్ మాట్లాడారు. కాస్త ఘాటైన పదాలు వాడటంతో ఈ అంశం వివాదాస్పదమైంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరు పడిన కొంత మంది సీనియర్ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. 


అద్దంకి దయాకర్‌పై హైకమాండ్‌కు జానారెడ్డి ఫిర్యాదు


కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సీనియర్ నేత జానారెడ్డి అద్దంకి దయాకర్ స్పీచ్‌పై పార్టీ తెలంగాణ వ్యవహారాలను చూసే ఢిల్లీ నేతల్లో ఒకరైన బోసురాజుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. అద్దంకి దయాకర్ లాంటినేతలు దూకుడుగా మాట్లాడం వల్ల పార్టీకి నష్టమని బోసురాజు దృష్టికి జానారెడ్డి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాంటి నేతల్ని దూరం పెట్టాలని ఆయన సూచించారని జానారెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంకా స్పందించలేదు. 




 



తమను తిట్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపాటు


అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఉద్దేశపూర్వకంగా తమ సోదరులను తిట్టిస్తున్నారని ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానాలు జరుగుతున్నా కష్టపడి పని చేశామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సభ పెట్టి ... అద్దంకి దయాకర్ తమను దూషిస్తున్నా వేదికపై ఉన్న సీనియర్ నేతలు వారించలేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 


రేవంత్ వ్యతిరేక వర్గీయులకు మరో అస్త్రం


అద్దంకి దయాకర్ తిట్ల వ్యవహారం రేవంత్ ను వ్యతిరేకించే వర్గీయులకు ఓ ఆయుధం లభించినట్లయింది. వారు కోమటిరెడ్డి సోదరులపై దయాకర్ చేసిన వ్యాఖ్యలపై తమకు పరిచయం ఉన్న పార్టీ హైకమాండ్ నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న జానారెడ్డి కూడా అద్దంకి దయాకర్ లాంటి నేతలు పార్టీకి నష్టమని హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీకి నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని.. వారంతా అలా చేస్తున్నప్పుడు పార్టీకి నష్టమని ఎవరూ అనడం లేదని.. కానీ వారిని విమర్శించగానే అదే చాన్స్ అని చాలా మంది తెరపైకి వస్తున్నారని రేవంత్ వర్గీయులు విమర్శిస్తున్నారు.