విలాసవంతమైన క్యాసినోల నిర్వహకుడు, హైదరాబాద్ కు చెందిన చికోటి ప్రవీణ్ వ్యవహారంలో మరో కీలకమైన ఆధారాలను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంపాదించింది. తాజాగా చికోటి వాట్సప్ డేటాకు సంబంధించిన స్క్రీన్ షాట్లు బయటికి వచ్చాయి. అందులో కొంత మంది ప్రజా ప్రతినిధుల పేర్లు బయటికి వచ్చాయి. ఏపీ, తెలంగాణలో దాదాపు 20 మంది ప్రజాప్రతినిధులతో చికోటికి లింక్‌ ఉన్నట్టు ఈ వాట్సప్ చాట్ ల ద్వారా అర్థం అవుతున్నట్లుగా తెలుస్తోంది. చికోటి నిర్వహించిన క్యాసినోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లినట్టు సమాచారం. వాట్సప్ వేదికగా చికోటి ప్రవీణ్ చాటింగ్‌ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 


ఆ జాబితాలో ఓ మంత్రి, హైదరాబాద్‌ శివారు నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హైదరాబాద్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ప్రజాప్రతినిధి సోదరుడు.. హైదరాబాద్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ప్రజాప్రతినిధి, మెదక్‌ జిల్లాకు చెందిన డీసీసీబీ చైర్మన్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు చికోటితో లింక్ ఉన్నట్టుగా సమాచారం. జూన్‌ 10 నుంచి నేపాల్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంలో ఎక్కడ, ఎవరికి ఎంత డబ్బు డిపాజిట్‌ చేయాలనే అంశాలకు సంబంధించి వారి మధ్య జరిగిన చాటింగ్‌ వివరాలను ఈడీ గుర్తించినట్లు తెలిసింది.


ఆ ఆధారాలు బయటికి రావడంతో చికోటికి టచ్‌లో ఉన్న ప్రజాప్రతినిధులను కూడా విచారణ చేసేందుకు ఈడీ వారికి నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. 20 మందికిపైగా మరికొంత మంది వీఐపీలకు కూడా నోటీసులు జారీ చేస్తారని తెలుస్తోంది. సోమవారం నుంచి వారు ఖరారు చేసిన జాబితాలో ఉన్న వారిని విచారణ చేసే అవకాశం ఉంది.


కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి రావాల్సిందే
ఈ చికోటి ప్రవీణ్ వ్యవహారంలో అక్రమ లావాదేవీల వ్యవహారం ఇప్పుడు మంత్రితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే వారు సంపాదించిన వాట్సప్ చాట్‌ల సమాచారాన్ని ట్రాన్స్‌లేట్ చేసి, ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లుగా తెలిసింది. వారికి నోటీసులు ఇవ్వడానికి కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి కనుక వస్తే మంత్రి, ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.