TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ కొనేందుకు ఒక్కొక్కరు ఎంతదూరమైన వెళ్లేందుకు వెనుకాడలేదని తెలుస్తోంది. ఇళ్లు, నగలు, పొలాలు ఇలా దేన్నైనా తాకట్టు పెట్టి మరీ పరీక్ష పేపర్ కొనేందుకు ముందుకు వచ్చారని దర్యాప్తులో తేలుతోంది. ఈ విషయాలు చూసి పోలిసులే విస్తుపోతున్నారు.
లీక్ అయిన ప్రశ్నాపత్రాలు అందుకునేందుకు లక్షల్లో ఖర్చు పెట్టాల్సి రావడంతో అభ్యర్థులు వారి నగలు, పొలాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. రేణుక, డాక్యానాయక్ దంపతులు ప్రవీణ్ కుమార్ కు రెండు దఫాల్లో రూ.10 లక్షలు చెల్లించి అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్ ను కొనుగోలు చేసినట్లు తేలింది. వాటిని కె.నీలేష్ నాయక్, పి.గోపాల్ నాయక్ లకు రాజేశ్వర్ నాయక్ అనే బ్రోకర్ ద్వారా డాక్యానాయక్ రూ.13.50 లక్షలకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. తిరుపతయ్య అనే మరో బ్రోకర్ ద్వారా రాజేందర్ కుమార్ కు రూ. 5 లక్షలకు అమ్మాడని తేలింది. ప్రశాంత్ రెడ్డి నుండి రూ.7.50 లక్షలు వసూలు చేశాడని అధికారులు గుర్తించారు. వారిలో నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, రాజేందర్ కుమార్ లు డబ్బులు సమకూర్చుకునేందకు పంట పొలాలను తనఖా పెట్టి మరీ డబ్బులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
మరో 11 మందికి ఏఈ ప్రశ్నాపత్రాలు చేరినట్లు సమాచారం..
నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ లకు మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్ గా పని చేసిన శ్రీనివాస్ రూ. లక్ష ఇచ్చినట్లు గుర్తించారు. ప్రశాంత్ రెడ్డి కూడా నగలు తాకట్టు పెట్టి కొంత, అప్పు తెచ్చి ఇంకొంత మొత్తం కలిపి రూ.7.50 లక్షలు ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురికే కాకుండా మరో 11 మందికి ఏఈ ప్రశ్నాపత్రాలు చేరినట్టు సిట్ పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రశ్నాపత్రాల విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఐదుగురి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. వారంతా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని ఇప్పటికే అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఓఎంఆర్ షీట్ లో డబుల్ బబ్లింగ్ చేసినట్లు గుర్తింపు
గ్రూప్-1 ప్రశ్నాపత్రం తన కోసమే తీసుకున్నానన్న ప్రవీణ్ కుమార్ మాటలు ఎంత వరకు నిజమనే విషయాన్ని అధికారులు తేల్చే పనిలో పడ్డారు. అయితే తనకు అధిక మార్కులు వస్తే అందరూ అనుమానించే అవకాశం ఉండటంతో.. తనను తాను డిస్ క్వాలిఫై చేసుకునేందుకు ఓఎంఆర్ షీట్ లో డబుల్ బబ్లింగ్ చేసినట్లు అధికారులు తేల్చారు. గ్రూప్-1 ప్రశ్నాపత్రాన్ని కేవలం తన కోసం మాత్రమే దొంగలించానని చెబుతున్న ప్రవీణ్ కుమార్ మాటలను నిర్ధారించడం పోలీసులకు సవాల్ గా మారింది. గ్రూప్-1 పరీక్షను టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో 20 మంది రాశారు. వారిని మరోసారి ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రూప్-1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన 84 మందిని అధికారులు ఇప్పటికే విచారించారు. అందులో చాలా మంది చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు యూపీఎస్సీ పరీక్షల్లో కూడా అర్హత సాధించినట్లు అధికారులు తేల్చారు. ఇప్పటి వరకు గ్రూప్-1 ప్రశ్నాపత్రం ఐదుగురికి, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం 15 మందికి చేరినట్లు పోలీసులు గుర్తించారు.
గ్రూప్-1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన రమేశ్, సురేశ్, షమీమ్ లను ఐదు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో వారిని బుధవారం ఉదయం చంచల్ గూడ జైలు నుండి హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తరలించారు. రమేశ్, షమీమ్ లకు ప్రవీణ్ కుమార్ ద్వారా, సురేశ్ కు రాజశేఖర్ రెడ్డి ద్వారా క్వశ్చన్ పేపర్లు వచ్చినట్టు తొలిరోజు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం.