Sharmila Padayatra: వైఎస్ఆర్టీపీ లీగల్ టీమ్ సభ్యులు వరంగల్ సీపీ రంగనాథ్‭ను కలిశారు. షర్మిల పాదయాత్రపై పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు లీగల్ టీమ్ వివరణ ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని.. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వైఎస్ఆర్టీపీ లీగల్ సెల్ ఛైర్మన్ వరప్రసాద్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశామని చెప్పారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోగా.. ఎందుకు అనుమతి ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారని సీపీకి వివరించారు. షోకాజ్ నోటీసులకు కోర్టు ఆదేశాలతో కూడిన వివరణ ఇచ్చామని ఆయన తెలిపారు. 


సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన గైడ్ లైన్స్‭ను పోలీసులు పాటించలేదని వైఎస్ఆర్టీపీ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. దీనిపై వరంగల్ సీపీ రెండు రోజుల సమయం అడిగారని ఆయన చెప్పారు. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని వరప్రసాద్ స్పష్టం చేశారు.


సమీక్షించి చెబుతాం


వైఎస్‌ఆర్‌టీపీ అభ్యర్థనపై వరంగల్ సీపీ స్పందించారు. తాము పరిస్థితులన్నింటినీ సమీక్షించి సమాధానం ఇస్తామన్నారు. రూల్స్‌ అన్నింటినీ చూడాలన్నారు. 


సీఎం కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించిన వైఎస్ షర్మిల..


తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన గూండాలతో తనకు ప్రాణహాని ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తన విషయంలో భయం పట్టుకుందని, అందుకే తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను సాగనివ్వడం లేదని విమర్శించారు. ఆడవాళ్లు లిక్కర్ స్కాంలో ఉండొచ్చు కానీ.. రాజకీయాలు చేయకూడదా..? అని సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. ప్రజల కోసం పాదయాత్ర చేపట్టే తనకు కాదని, సీఎం కేసీఆర్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. వైఎస్సార్ లెగసీ చూసి కేసీఆర్ కి భయం పట్టుకుందని, మా పాదయాత్ర కి వస్తున్న ఆదరణ చూస్తే కేసీఆర్ కి వణుకు పుడుతోందన్నారు.


పాదయాత్ర ఆపాలని కేసీఆర్ కంకణం 


తన పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అవుతుందని, ఇది కేసీఆర్ కి స్పష్టంగా అర్థం కావడంతోనే పాదయాత్రని ఆపాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని షర్మిల మండిపడ్డారు. పోలీస్ ల భుజాన తుపాకీ పెట్టీ మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు ఏసిపి లు మా దగ్గరకు వచ్చి పాదయాత్ర ను ఆపాలని మొదట చెప్పారు. రెండో సారి హైదరాబాద్ లో రిమాండ్ కోరారు. మూడోసారి కోర్ట్ ఆదేశాలు ఉన్నా కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తుంటే పోలీస్ శాఖను జీతగాల్లులా, టీఆర్ఎస్ కార్యకర్తల్లా కేసీఆర్ దొర వాడుతున్నారు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.


‘మీ అవినీతి బయట పెడుతుంటే తినేది జీర్ణం అవ్వడం లేదా..?. ఒక మహిళ పాదయాత్ర చేసి లోపాలు ఎత్తి చుపుతుంటే మింగుడు పడటం లేదు. ఎలాగైనా పాదయాత్ర ఆపాలని కంకణం కట్టుకున్నారు. పాదయాత్ర ఆపడానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అని చెప్తున్నారు. నా బస్సు తగల బెట్టింది ఎవరు. మా వాళ్ళను కొట్టింది ఎవరు..? మా కార్లను పగలగొట్టింది నేనేనా..?. ఎక్కడ కూడా మేము శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదు. ఏ ఒక్క నియోజక నియోజక వర్గంలో కూడా మేము విఘాతం కలిగించలేదు. మా పరిధి దాటి అసభ్యకరంగా మాట్లాడలేదు. నర్సంపేట లో తప్పు మాది అని సృష్టిస్తున్నారు. మా బస్సులు టీఆర్ఎస్ నేతలు తగలబెట్టారు. మా కార్యకర్తలను కొట్టారు. మమ్మల్ని కొట్టడమే కాకుండా మేమే తప్పు చేశాం అంటున్నారు. నేను వ్యక్తిగత దూషణలుకు దిగాను అంటున్నారు. తప్పులు ఎత్తి చూపిస్తే వ్యక్తి గత దూషణ అంటున్నారు. నా పై మంగళ వారం మరదలు అంటే అది వ్యక్తి గత దూషణ కాదా..? నాకు కనీసం క్షమాపణ చెప్పకుండా నన్నే చిత్ర హింసలకు గురి చేస్తున్నారు’ అని పత్రికా ప్రకటనలో షర్మిల పలు విషయాలు ప్రస్తావించారు.