Rajiv Gandhi International Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ విమానం ఫ్లై బిగ్ (Flybig) అనే సంస్థకు చెందినది. ఆదివారం (మే 29) ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియాకు వెళ్లాల్సి ఉన్న ఈ ఫ్లైబిగ్ (Flybig) విమానం.. రన్‌వే పైకి వెళ్లగానే దాని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్ వే పైనే ఆగిపోయింది. అయితే, ఇంజిన్ల నుంచి ఎలాంటి మంటలు రాకపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరలేదు. విమాన సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ప్రయాణికులు సంస్థ అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు నిరసన చేశారు.
Nepal Flight Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్
నేపాల్‌లో ఓ ప్రయాణికుల విమానం ఆచూకీ లేకుండా పోయింది. జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన తారా ఎయిర్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధం కోల్పోయింది. ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు. తారా ఎయిర్ కు చెందిన 9N - AET విమానం పోఖారా నుంచి జోమ్‌సోమ్‌కు వెళ్తోంది. నేపాలీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానం ఈరోజు ఉదయం 9:55 గంటలకు పోఖారా నుండి బయలుదేరింది. 10:20కి జోమ్ సోమ్‌లో దిగాల్సి ఉంది. అయితే 11 గంటల నుంచి ఈ విమానంతో ఏటీసీకి ఎలాంటి సంబంధాలు లేవు. ఇది ట్విన్ ఇంజన్ విమానం అని విమానాశ్రయ అధికారులు చెప్పారు.
నేపాల్‌లో ఓ ప్రభుత్వ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వివరాల ప్రకారం, అదృశ్యమైన విమానంలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు ఉన్నారు. మిగిలిన వారు నేపాల్‌కు చెందిన వారు ఉన్నారు. విమానంలో సిబ్బందితో సహా 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా నేపాల్‌లోని మీడియా సంస్థ కాంతిపూర్‌తో మాట్లాడుతూ కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే, కో-పైలట్ ఉత్సవ్ పోఖారెల్, ఎయిర్ హోస్టెస్ కిస్మి థాపా విమానంలో ఉన్నారని చెప్పారు.